దేశంలో మతచిచ్చుతో బిజెపి పాలన
ప్రజాశక్తి-కావలి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ మతచిచ్చుతో పరిపాలన సాగిస్తుందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో శాంతినగర్లో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలిస్తుందని విమర్శించారు. మతాలపేరుతో ప్రజల ఐక్యతను దెబ్బతీస్తూ కేంద్రలోని బిజెపి ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజల మధ్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధకాండ ప్రయోగిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల నిత్యావసర వస్తువులు ప్రయాణ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందన్నారు. మతం పేరుతో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కె.మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజాకార్మిక వ్యతిరేక విధానాలపై ప్రజలు కార్మికులు, ఉద్యోగులు, రైతుల సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్న వామపక్ష పార్టీలు చేస్తున్న పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.సత్య నారాయణ, వి.బాబురావు, వై.సత్య, డి.వై.ఎఫ్‌ఐ నాయకులు సాయి, అజరు, స్థానికులు పాల్గొన్నారు.










