కారుతున్న ముక్కు..
తుడుచుకున్న కొంగు
జారుతున్న చెడ్డీ.. చుట్టుకున్న వోణి
మట్టి కౌగిళ్ళు.. ఆడుకునే బొమ్మలు
చందమామ కథలు.. గోరుముద్దలు
జోల పాటలు.. హాయి నిద్రలు
ఎంత మధురమో బాల్యం!
తాత కంచంలో తిన్న పచ్చడి ముద్దలూ..
పెరుగన్నంలో నంజుకున్న ఆవకాయ బద్దలు
అమ్మమ్మ పక్క తడిపిన గుర్తులూ..
ఇంటి పందిట్లో గోళీల ఆటలు
వీధి వాకిట్లో గోడుంబిళ్ల ముచ్చట్లూ
పెద్దోళ్ళందరు చదివిన తిట్ల దండకాలు
కొబ్బరాకు బూరలూ.. అలుపు లేని నోళ్లు
కోతి కొమ్మచ్చులూ వీపుపై మోగిన దరువులు
చెప్పుల్లేని కాళ్ళూ.. ఎండలో నుంచున్న గుర్తులు
వంగుళ్ళూ దూకుళ్ళూ.. పగిలిన మోకాళ్ళు
సూర్యునితో ఆటలూ చంద్రునితో పోటీలు
కాదేదీ అప్పుడసాధ్యం!
బడిగంట మోగాక...
బ్లాక్ బోర్డు బాల్యంలో.. ఈత బెత్తం హడావిడి
కాగితం పడవలూ.. కాకిఎంగిళ్లు
తుంటరి పనులూ.. తిట్ల తలంట్లు
అరమరికల్లేని నేస్తాలూ.. కొలమానం తెలియని ప్రేమలు
వేసవి సెలవలూ.. మల్లెపూల జడలు
ఎన్నెన్నో మధురాలు!
బాల్యాన్ని తరిమిన కౌమారం
నేనున్నానన్న యవ్వనం
తరుముకొచ్చే వృద్ధాప్యం
దశలు, దశాబ్దాలెన్ని దాటినా
తలుచుకున్న ప్రతిసారీ తరిగిపోని జ్ఞాపకం
బాల్యమెంత బంగారం
మళ్ళీ మళ్ళీ పుట్టాలనిపించేలా..!
- కోడే యామినీదేవి
94928 06520










