Jun 29,2023 18:06

మాస్కో : మంగళవారం ఉక్రెయిన్‌లోని రెస్టారెంట్‌పై రష్యా దళాలు క్షిపణి దాడి చేశాయనే ఆరోపణలను క్రెమ్లిమ్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ బుధవారం ఖండించారు. ఉక్రెయిన్‌లో క్రమాటోర్క్సో రెస్టారెంట్‌పై రష్యా దళాలు ఇస్కాండర్‌ క్షిపణులను ఉపయోగించాయని ఉక్రెయిన్‌ పోలీసులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన ఈ క్షిపణి దాడిలో 10 మంది పౌరులు మృతి చెందారు. దాదాపు 60 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ పోలీసులు పేర్కొన్నారు. అయితే రష్యా దళాలు క్షిపణి దాడి చేసి.. ఉక్రెయిన్‌ పౌరుల్ని హతమార్చాయనే వార్తలపై పెస్కోవ్‌ స్పందించారు. బుధవారం ఆయన బ్రిటిష్‌ టెలివిజన్‌ అనే న్యూస్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పౌరుల మౌలిక సదుపాయాలపై రష్యా దాడి చేయదు అని అన్నారు. డాన్‌బాస్‌లో తమ ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ ప్రారంభమైనప్పటి నుండి మైనర్‌లను రక్షించడానికి రష్యా దళాలు ఎల్లప్పుడూ చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాల నుండి జనాభాను సురక్షిత ప్రాంతాలకు రష్యా దళాలు తరలిస్తున్నాయి. రష్యా దళాలు పౌరుల పట్ల తీసుకునే చర్యల్లో ఇది కూడా ఒకటిగా గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకూ రష్యా దళాలు కేవలం సైనిక స్థావరాలు, వాటిని అనుసంధానమైన మౌలిక సదుపాయాలపై మాత్రమే బాంబు దాడి చేస్తున్నద'ని ఆయన నొక్కి చెప్పారు.