Jun 22,2023 22:30

ఇకపై భారత్‌ ఫైటర్‌ జెట్‌లకు దేశీయంగానే ఇంజన్ల తయారీ
ఆరోగ్య, పర్యావరణ, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలపై సంతకాలు
వైట్‌హౌస్‌లో బైడెన్‌ దంపతులతో మోడీ భేటీ
శ్వేతసౌధంలో ఘన స్వాగతం

వాషింగ్టన్‌ : ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్న వేళ ఇరుదేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ధృడపరుచుకోవాలని ఇరు దేశాధినేతలు భావించారు.తొలుత గురువారం ఉదయం వైట్‌హౌస్‌లో బైడెన్‌ దంపతులు ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. తర్వాత ఇరువురు సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గన్నారు. రక్షణ, సాంకేతికత, ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో సహకారంపై పలు ఒప్పందాలు చేసుకున్నట్లు సంయుక్త ప్రకటన పేర్కొంది.
భారత సైనిక విమానాలకు జెట్‌ ఇంజన్లను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు జనరల్‌ ఎలక్ట్రికల్‌ కంపెనీ (జిఇ)తో ఒప్పందం కుదిరింది. ఇకపై హెచ్‌ఎఎల్‌తో కలిసి ఇంజన్లు తయారుచేయనున్నామని, ఈ మేరకు అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు గురువారం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా తయారు చేసే సాయుధ ఎంక్యుా9బి సీ గార్డియన్‌ ద్రోణ్‌లను భారత్‌ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు 31 ద్రోణ్‌ల కొనుగోలుకు 300కోట్ల డాలర్లతో ఒప్పందం కుదిరింది. అలాగే భారతీయులు హెచ్‌ 1బి వీసాల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేలా బైడెన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. మోడీ పర్యటనా సమయంలోనే ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం వుంది.
ఈ గౌరవం భారతీయులందరిదీ
వైట్‌హౌస్‌ వద్ద బైడెన్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడిన మోడీ ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ అందచేస్తున్న సేవలను అభినందించారు. ఈనాడు ఇక్కడ అందిన గౌరవం 140కోట్ల మంది భారతీయులకు, 40లక్షల మంది ఇండియన్‌ అమెరికన్స్‌కి చెందుతుందని మోడీ వ్యాఖ్యానించారు. గతంలో అనేకసార్లు తాను వైట్‌హౌస్‌ సందర్శించానని, కానీ ఈసారి ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ కోసం వైట్‌హౌస్‌ ద్వారాలు తెరవడం ఇదే తొలిసారని అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ సంబంధాలకు మీరే అసలైన బలం అంటూ ఇండియన్‌ అమెరికన్స్‌ని ప్రశంసల్లో ముంచెత్తారు. మన వైవిధ్యతను చూసి రెండు దేశాలు గర్విస్తున్నాయని అన్నారు. అందరి ప్రయోజనాలు, అందరి సంక్షేమం అనే ప్రాధమిక సూత్రాన్ని తామిద్దరం నమ్ముతామని చెప్పారు. అనంతరం బైడెన్‌ కూడా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య గల సారూప్యతలను నొక్కి చెప్పారు. రెండు గొప్ప దేశాలు, గొప్ప మిత్రులు, గొప్ప శక్తి సామర్ధ్యాలు కలిగిన దేశాలు 21వ శతాబ్దాన్ని నిర్వచించగలవని అన్నారు.
బైడెన్‌ దంపతులతో మోడీ భేటీ
శ్వేత సౌధంలో బైడెన్‌ దంపతులను కలుసుకున్న మోడీ వారికి తాను తెచ్చిన బహుమతులను అందచేశారు. ల్యాబ్‌లో కృత్రిమంగా తయారుచేసిన ఆకుపచ్చ డైమండ్‌ను అమెరికన్‌ ప్రధమ మహిళ జిల్‌ బైడెన్‌కు అందచేశారు. ఈ భేటీలో ఇరు దేశాలు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బగ్చి ట్విట్టర్‌లో వెల్లడించారు.