- వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేయండి
- రోడ్డెక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
- రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
- అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు
ప్రజాశక్తి- యంత్రాంగం : రెగ్యులర్ చేస్తామని చెప్పిన రెండేళ్ల గడుపు పూర్తయి నాలుగు నెలులు దాటినా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోనందుకు నిరసనగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కారు. ఆందోళనకు దిగితే చర్యలు తీసుకుంటా మని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా బేఖాతరు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. అన్ని ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా గ్రూపుల నుంచి స్వచ్ఛందంగా ఇప్పటికే వైదొలగిన వీరు గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపిడిఒ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాలు, కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న వారిని పర్మినెంట్ చేసి అదే రోజు నుంచి పేస్కేల్ అమలు చేయాలని, నూతన పిఆర్‌సిని అమలు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు, డిఎలను విడుదల చేయాలని, పేద వర్గాలకు చెందిన తమ పట్ల చిన్నచూపు తగదని నినాదాలు చేశారు. ప్రొబేషన్ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించడాన్ని తీవ్రంగా నిరసించారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నామని, ప్రొబేషన్ డిక్లేర్ చేయడంలో ప్రభుత్వ జాప్యం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆర్‌డిఒలకు, సబ్ కలెక్టర్లకు, మున్సిపల్ కమీషనర్లకు, ఎండిపిఒలకు, తహశీలా ్దర్లకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని వార్డు, గ్రామ సచివాలయాల ముందు నిరసనలు తెలిపారు. గుంటూరులో కలెక్టర్ గ్రీవెన్స్‌లో అధికారులకు వినతిపత్రాలిచ్చారు. విశాఖ నగరంలోని జివిఎంసి జోన్-4 కార్యాలయంలో వార్డు సచివాలయ ఉద్యోగులు సమావేశమయ్యారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో ఎమ్మెల్యే జోగి రమేష్‌కు వినతిపత్రం అందించారు. విజయనగరంలో నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, అనంతరం అక్కడ ఎదుట ధర్నా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో సచివాలయ ఉద్యోగులు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
రెండేళ్ల సర్వీసున్న వారికి పే స్కేల్ : ఎపిజిడబ్ల్యుఎస్‌ఇడబ్లుఎఫ్
గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తూ రెండేళ్లు పూర్తయిన వారికి వెంటనే పే స్కేల్‌ను వర్తింప చేయాలని ఎపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య (ఎపిజిడబ్ల్యుఎస్‌ఇడబ్ల్యుఎఫ్) అధ్యక్షురాలు కె అనురాధ, ప్రధాన కార్యదర్శి ఎం గురుస్వామి డిమాండ్ చేశారు. రూ.15 వేలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, ప్రభుత్వం వెంటనే కొత్త పిఆర్‌సి ప్రకారం సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని వారు కోరారు.
తక్షణమే విధులకు హాజరుకండి : అజయ్ జైన్
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్, పే స్కేల్ ఖరారుకు సిఎం జగన్ సానుకూలంగా ఉన్నారని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరు జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులంతా మంగళవారం నుంచి విధులకు హాజరు కావాలని ఆయన కోరారు. రాష్ట్ర సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులతో అజరుజైన్, కో-ఆర్డినేటర్ రమేష్‌బాబు, ఒఎస్‌డి తిమ్మయ్య సోమవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంక్రాంతి కానుకగా ప్రొబేషన్‌ను డిక్లేర్ చేసి, పే స్కేల్‌ను ఫిక్స్ చేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు అజరుజైన్‌ను కోరారు. అనంతరం ఆయన స్పందిస్తూ మాట్లాడుతూ వాట్సాప్, టెలిగ్రాముల నుంచి బయటకు రావడం, విధులను బహిష్కరించి రోడ్డెక్కడంపై సిఎం సీరియస్‌గా ఉన్నారన్నారు. ప్రొబేషన్‌ను జూన్ వరకు పొడిగించాలని సిఎం ఓరల్‌గా చెప్పారని, అంతకంటే ముందుగానే డిక్లేర్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై సిఎంకు నివేదిస్తామన్నారు. ఇప్పటికే విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలకు కలెక్టర్లు సిద్ధమవ్వగా తామే వారించామన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరిస్తే మాత్రం ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. రూ.15 వేలతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్ తెలిపారు.
27 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాల్సిందే
- పిఆర్‌సిపై ఆందోళనలకు సంపూర్ణ మద్దతు
- సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తీర్మానం
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం : పిఆర్‌సి ఫిట్‌మెంట్‌పై ముఖ్యమంత్రి ప్రకటన రాష్ట్రంలోని వివిధ కేడర్ల ఉద్యోగులను, పెన్షనర్లను, కార్మికులను, స్కీమ్ వర్కర్లను నిరాశకు గురిచేసిందని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం పేర్కొంది. 27 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించేలా పునరాలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని విమర్శించింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరుగుతున్న సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో తొలిరోజు సోమవారం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తగ్గించడం అన్యాయమని, 27 శాతం ఫిట్‌మెంట్‌పై ఆలోచించాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్టుటైమ్ ఉద్యోగులకు కనీస బేసిక్, డిఎ, హెచ్‌ఆర్‌ఎ అమలు చేసి రెగ్యులర్ చేయాలని సమావేశం కోరింది. తీర్మానాన్ని సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎవి.నాగేశ్వరరావు ప్రవేశపెట్టగా కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు బలపరిచారు. రాష్ట్ర కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సచివాలయ ఉద్యోగులకు ఈ జనవరి నుండే పిఆర్‌సి అమలు చేయాలని, రెండు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న వారందరికీ ఎటువంటి రాత పరీక్షలూ నిర్వహించకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని, స్కీమ్ వర్కర్లకు 30 శాతం వేతన పెంపు, రూ.5 లక్షల రిటైర్‌మెంట్ బెనిఫిట్ అమలు చేయాలని సమావేశం కోరింది. మెరుగైన పిఆర్‌సి కోసం ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనల న్నింటికీ సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపింది. ఆర్‌టిసి కార్మికులకూ 11వ పిఆర్‌సి అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.










