నల్లచెరువు : నల్లచెరువలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు భూ స్వాధీన పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని కె.పూలకుంట రోడ్డు వద్ద ఉన్న ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 406లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ పేదలు సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు రోజుల క్రితం భూస్వాధీన పోరాటం నిర్వహించారు. అందులో జెండాలు పాతి, గుడిసెలు వేసుకుని అక్కడే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు జిఎల్.నరసింహులు తదితరులు అక్కడికెళ్లి పేదలతో మాట్లాడారు. అనంతరం ఇంతియాజ్ మాట్లాడుతూ గత 14 నెలల క్రితం ఇదే భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వాలని జెండాలు పాతి భూస్వాధీన పోరాటం చేశామని చెప్పారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లో ఇంటి పట్టా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అర్జీలు ఇచ్చి సంవత్సరం పైగా అవుతున్నా ఇప్పటివరకు వారికి పేదలకు పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం పేదలు అక్కడే గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే అర్హులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. సిఐటియు నాయకులు జిఎల్.నరసింహులు మాట్లాడుతూ పేదల ఇంటి స్థలాల సమస్యను గుర్తించి వెంటనే వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో సిపిఎం ఆధ్వర్యంలో పేదల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రీరాములు, మండల సిఐటియు కార్యదర్శి రామకష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమేష్, సదాశివ, మురాషా, బావయ్యతో పాటు పేదలు పాల్గొన్నారు.










