- రైల్వే స్టేషన్ల అభివృద్ధి పేరుతో ఒక్కో టికెట్‌పై రూ.10 నుంచి రూ.25 వసూలు
- విజయవాడ, సికింద్రాబాద్, తిరుపతి, విశాఖ, నెల్లూరుపై అధిక ప్రభావం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రైల్వే స్టేషన్ల అభివృద్ధి పేరుతో స్టేషన్ డెవలప్‌మెంట్ ఫీజు (ఎస్‌డిఎఫ్) వసూళ్లకు రైల్వే మంత్రిత్వశాఖ గ్రీన్‌సిగల్ ఇచ్చింది. ఈ మేరకు రైల్వే జోనల్ కార్యాలయాలకు సర్క్యులర్లు పంపింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రయాణికులపై భారం పడనుంది. ఇప్పటికే రైల్వేలో వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు నిలిపేసిన రైల్వేశాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రయాణికులకు ఆర్థిక భారంగా మారనుంది. ఇప్పటికే నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో రైల్వే ఆస్తులను కట్టబెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో మరో వైపు రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు ఇప్పటికే అప్పజెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్‌డిఎఫ్ పేరుతో ఫీజులను వసూలు చేసేందుకు రైల్వే స్టేషన్లను ఎ, బి, సి కేటగిరిల కింద వర్గీకరించారు. రైలు టికెట్ కంటే ఎస్‌డిఎఫ్ ఛార్జీలు అధికమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదనపు వడ్డనను అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లు, ఆధునికీకరించిన రైల్వే స్టేషన్లలో తొలుత అమలు చేయనున్నారు. ప్రయాణికులు రైలు ఎక్కే స్టేషన్‌లో టికెట్‌తో కలిపి ఎస్‌డిఎఫ్ ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అదనపు ఛార్జీలను ఇంతటితో ఆపకుండా ప్రయాణికుడు ప్రయాణించే గమ్యస్థానం రైల్వే స్టేషన్ ఆధునికీకరించిందైన పక్షంలో మరో 50 శాతం (నిర్ణయించిన ధరలకు)తోడు అదనంగా రైల్వే శాఖ వసూలు చేయనుంది. రైల్వే ప్లాట్‌ఫారం టికెట్స్ ధర రూ.10లకు తోడు అదనంగా స్టేషన్‌ను బట్టి వసూలు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరతోపాటు అదనంగా జిఎస్‌టి ఉంటుందని పేర్కొంది. సబ్ అర్బన్‌లో (సింగిల్ జర్నీ ఫేర్), సీజన్ టికెట్స్ (సబ్ అర్బన్, నాన్ సబ్ అర్బన్)లో ఎస్‌డిఎఫ్ ఛార్జీల నుంచి మినహాయించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యధికంగా విజయవాడ, సికింద్రాబాద్, తిరుపతి, నెల్లూరు స్టేషన్లలో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.











