Mar 17,2022 06:58

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంటున్న వరుస మరణాల పట్ల రాష్ట్ర ప్రజానీకం అంతా ఆందోళన చెందుతోంది. ఒకరి తరువాత ఒకరిగా రోజుల వ్యవధిలోనే ఇక్కడ మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి బుధవారం తుదిశ్వాస విడిచారు. దాదాపుగా వారం రోజుల్లోనే ఇంత మంది చనిపోవడంతో సహజంగానే వీటిపై అనుమానాలు నెలకొన్నాయి. సారా తాగడం వల్లే ఈ మరణాలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్థానికంగా లభిస్తున్న సాక్ష్యాలు, మృతుల కుటుంబాలు చెబుతున్న విషయాలు కూడా ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయి. కానీ, అధికారపార్టీలో మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు ఇవి సహజ మరణాలే అని బల్లగుద్దుతున్నారు. ప్రతిపక్షాలు శవరాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి అలా ఉంచితే, దీనిపై స్పందించి, వాస్తవాలను వెలికితీయాల్సింది, బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సింది ప్రభుత్వమే కదా! పోనీ, ప్రభుత్వం చెబుతున్నట్లు సహజ మరణాలే అన్న వాదనను నమ్మడానికైనా ఆధారాలు కావాలికదా! ఆ ఆధారాలు వెలుగులోకి రావాలంటే పూర్తిస్థాయి విచారణ జరిపించడానికి మించి మరో మార్గం ఏముంది? ఆ దిశలో చర్యలు తీసుకోకుండా అధికారంలో ఉన్న వారు అడ్డగోలు వాదనకు దిగితే అర్ధం ఏమిటి? అసాధారణ రీతిలో వరుస మరణాలు ఒక ప్రాంతంలో సంభవిస్తే దానిపై బాధ్యత కలిగిన ప్రభుత్వమైతే వెంటనే విచారణకు ఆదేశించాలి. శాసన సభల సమావేశాలు జరుగుతున్నాయి గనుక ఆ అంశంపై అధికారపక్షమే ప్రత్యేక చొరవను ప్రదర్శించాలి. కాని, దానికి భిన్నంగా ముఖ్యమంత్రి స్వయంగా మరణాల తీవ్రతను తేలికగా తీసిపారేస్తూ వ్యాఖ్యానించడం గర్హనీయం.
           యాభై నుండి 55 వేల మంది జనాభా ఉన్న చోట సారా తయారు చేయడం సాధ్యమవుతుందా అని శాసనసభలో ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రకటనే నిజమైతే గడిచిన నాలుగైదు రోజుల్లో జంగారెడ్డి గూడెం, పరిసర ప్రాంతాల్లో 22 మందిపై సారా కేసులు ఎలా పెట్టారు? వీరిలో నలుగురిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అరెస్ట్‌ కూడా చేసింది. ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్న సమయంలోనే ఇక్కడ వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద గడిచిన నాలుగైదు రోజుల్లో ఈ ప్రాంతంలో 243 లీటర్ల సారా, 18,300 లీటర్ల బెల్లం ఊట, 63,048 కిలోల నల్లబెలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెక్కలన్నీ చెప్పేదేమిటి? జంగారెడ్డిగూడెంతో పాటు పరిసర ప్రాంతాల్లో సారా కాయడమన్నది చిన్నసైజు పరిశ్రమగా సాగుతోందనే కదా! దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రభుత్వ షాపుల్లో మద్యం అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ, సారా అమ్మితే వస్తుందా...అన్నది అధికారపార్టీ సభ్యుల మరో ప్రశ్న. ప్రభుత్వానికి ఆదాయం రాకపోవచ్చుగానీ, దొంగసారాకు కొమ్ము కాసే స్థానిక నేతల ఖజానా నిండుతుందన్న విషయాన్ని కాదనలేరు కదా!
         ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జంగారెడ్డి గూడెం వరుస మరణాలపై ప్రతిపక్షాలు కోరుతున్న విధంగా తక్షణం న్యాయ విచారణకు ఆదేశించాలి. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలి. నష్టపరిహారం చెల్లించాలి. మద్యంలో సారాను కల్తీ చేసి అమ్ముతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై తక్షణం దృష్టి సారించాలి. మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేయాలి. ఈ దిశలో తీసుకునే కఠిన చర్యలే సారా తయారీని ఉక్కుపాదంతో అణచివేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలపై ప్రజలకు విశ్వాసాన్ని కలగచేస్తాయి.