బొలీవియాలో ఫాసిస్టు, మితవాద శక్తులతో కలసి అమెరికా ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ వాటన్నిటిని తుత్తునియలు చేస్తూ బొలీవియా ప్రజలు మొరేల్స్ నేతృత్వంలోని మూవ్‌మెంట్ టువార్డ్స్ సోషలిజం (ఎంఎఎస్) పార్టీకి బ్రహ్మరథం పట్టారు. రెండు సార్లు వాయిదా పడి చివరికి అక్టోబరు 18న జరిగిన బొలీవియా సార్వత్రిక ఎన్నికల్లో వెల్లడైన ప్రాథమిక ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి మూవ్‌మెంట్ టువార్డ్స్ సోషలిజం (ఎంఎఎస్) పార్టీ అభ్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి లూయిస్ ఆర్సే 53 శాతం ఓట్లతో తిరుగులేని ఆధిక్యత సాధించారు. పార్లమెంటు ఉభయ సభల్లోను మొరేల్స్ పార్టీకి స్పష్టమైన, పూర్తి మెజార్టీ లభించింది. అమెరికా, దాని తైనాతీల దన్నుతో బరిలోకి దిగిన మాజీ అధ్యక్షుడు, మితవాద సిటిజెన్స్ కమ్యూనిటీ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి అభ్యర్థి కార్లాస్ మెసాకు 31.2 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. గత ఏడాది ప్రజాస్వామ్య బద్ధంగా నాల్గవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన మొరేల్స్‌ను కూలదోసిన అమెరికా కుట్రలో ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరించిన లూయిస్ ఫెర్నాండో కమాచోకు బొలీవియన్ ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా అధికార దుర్వినియోగం చేసి, డబ్బు, కార్పొరేట్ మీడియా సహకారంతో ఎన్ని కుతంత్రాలు పన్నినా కమాచోకు కేవంల 14.1 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఓటమి తప్పదని ముందే గ్రహించిన తాత్కాలిక అధ్యక్షురాలు, కుట్రదారుల చేతిలో కీలుబొమ్మ అయిన జెనీన్ అనీజ్ మధ్యలోనే పోటీ నుంచి తప్పుకున్నారు. బొలీవియా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో ఎవరినైనా విజేతగా ప్రకటించాలంటే మొత్తం పోలైన ఓట్లలో 50 శాతానికి మించి ఒక ఓటు అదనంగా సాధించాలి. లేదా 40 శాతం ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థిపై కనీసం 10 శాతం ఓట్ల ఆధిక్యత కనబరచాలి. లేకుంటే రెండో రౌండ్ ఎన్నికలకు వెళ్ల్లాల్సి ఉంటుంది. ఆదివారం నాటి ఎన్నికల్లో రెండో రౌండ్ అవసరం లేకుండానే ఆర్సే స్పష్టమైన మెజార్టీ సాధించారు. అమెరికా, దాని తైనాతీల కుట్రలు కుతంత్రాలతో రాజకీయ అస్థిరత, అరాచకాలకు నిలయంగా మారిన బొలీవియాలో మూలవాసీ తెగకు చెందిన తొలి అధ్యక్షుడిగా మొరేల్స్ 2006లో తొలిసారి అధికారం చేపట్టారు. అప్పటి నుంచి 2019 నవంబరు10 వరకు అంటే అమెరికా ప్రేరేపిత సైనిక కుట్రకు బలయ్యేంతవరకు ఆయన నిరాఘాటంగా పాలించారు. ఆయన అనుసరించిన ప్రజానుకూల విధానాలు బొలీవియా ముఖచిత్రాన్నే మార్చేశాయి. అంతవరకు అమెరికా, దేశీయ బడా కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లో వున్న చమురు, గ్యాస్ వంటి సహజ వనరులను బొలివేరియన్ ప్రభుత్వం జాతీయ చేసింది. ఆ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించింది. విదేశీ మారక నిల్వల కొరత అన్న ప్రసక్తే లేకుండా చేసింది. ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల్లో వాడే లిథియంను లూటీ చేయాలని చూసిన అమెరికన్ కంపెనీలకు కళ్లెం వేసింది. మెరుగైన రేటు చెల్లించేందుకు ముందుకొచ్చిన చైనాకు లిథియం నిక్షేపాలను విక్రయిస్తూ ఒప్పందాలు చేసుకుంది. అమెరికన్ సామ్రాజ్యవాద నయా ఉదారవాద విధానాలకు ఈ ప్రాంతంలో చెక్ పెట్టేందుకు గట్టిగా కృషి చేసింది. లాటిన్ అమెరికాలోని 'బొలివేరియన్ పింక్ రివల్యూషన్' ద్వారా అధికారంలోకి వచ్చిన వామపక్ష అనుకూల ప్రభుత్వాలతో కలసి ప్రాంతీయ సహకార కూటముల ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. బొలీవియా ప్రజల జీవన ప్రమాణాల పెంచడంలోను, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడంలోను మొరేల్స్ ప్రభుత్వం ఇతర లాటిన్ అమెరికా దేశాలకు ఆదర్శంగా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం వరకు పేద దేశంగా ఉన్న బొలీవియాను అధిక జిడిపి కలిగిన దేశంగా తీర్చిదిద్దడంలో మొరేల్స్ కృతకృత్యులయ్యారు. నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకొచ్చిన ఏ దేశాన్నీ సామ్రాజ్యవాదులు సహించరు. 'బొలివేరియన్ పింక్ రివల్యూషన్' ద్వారా వెనిజులా, బొలీవియా, బ్రెజిల్, అర్జెంటీనా, ఈక్వెడార్, ఎల్‌సాల్వెడార్, నికరాగ్వా, ఉరుగ్వేల్లో అధికారంలోకి వచ్చిన ప్రత్యామ్నాయ ప్రభుత్వాల్లో కొన్నిటిని అమెరికా సైనిక, పార్లమెంటరీ కుట్రలద్వారా కూల్చివేసింది. అయినా, ఇప్పటికీ వెనిజులా, అర్జెంటీనా, నికరాగ్వా వంటి దేశాలు అమెరికా కుట్రలను ఎదిరించి నిలిచాయి. బొలీవియాలో అమెరికా కుట్ర ద్వారా, ఎలాంటి ఎన్నిక లేకుండా గద్దెనెక్కిన అనీజ్ అన్ని రంగాల్లోను దేశాన్ని అథోగతిపాల్జేశారు. 2019 నాటికి 3.1 శాతంగా ఉన్న నిరుద్యోగం ఈ ఏడాది కాలంలో 11.8 శాతానికి చేరుకుంది. ఆర్థిక వృద్ధి రేటు 6 శాతం మేర పడిపోయింది. కోటీి పది లక్షల జనాభా కలిగిన ఈ చిన్న దేశంలో కరోనా మహమ్మారి బారిన పడి 8,400 మంది చనిపోయారు. మొరేల్స్ ప్రభుత్వానికి, అమెరికా సామ్రాజ్యవాదుల చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించే ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించారు. అందుకే బులెట్ కు బ్యాలెట్‌తో దిమ్మతిరిగే రీతిలో సమాధానమిచ్చారు. ఈ విజయం లాటిన్ అమెరికాలోను, తక్కిన ప్రపంచ దేశాల్లోను నయా ఉదారవాద విధానాలు, ఫైనాన్స్ పెట్టుబడి గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు గొప్ప ఊపునిస్తుంది.










