చెత్త పన్ను చెల్లించలేదన్న కారణంతో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుధవారంనాడు దుకాణాల ముందు చెత్త వేయించడం దారుణం. ఆస్తి, నీటి పన్నుతో పాటు ట్రేడ్ లైసెన్స్ రుసుం చెల్లిస్తున్నామని, మళ్లీ ఈ చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని దుకాణాదారులు ప్రశ్నిస్తే చెత్తపన్ను కట్టకపోతే పర్యవసానాలు ఈ విధంగానే ఉంటాయని మున్సిపల్ అధికారులు దురుసుగా మాట్లాడడం అత్యంత బాధ్యతారహితం. ఇలా దుకాణాల ఎదుట చెత్త వేయడం వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యాపారులు వాపోయినా అధికారులు పట్టించుకోకపోవడం అమానుషం. 'చెత్త పన్ను చెల్లించని వారి ఇళ్ల ముందు చెత్త వేయించండి' అని శ్రీకాకుళం ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మున్సిపల్, వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించడం, దానిపై విమర్శలు వెల్లువెత్తిన విషయం అందరికీ తెలిసిందే! కర్నూలు కార్పొరేషన్ అధికారులు సదరు ఆదేశాన్ని శిరోధార్యంగా భావించారో లేక వారి సొంత ఆలోచనో కాకపోతే సర్కారు వారే మౌఖిక ఉత్తర్వులిచ్చారో తెలియదు కాని జనానికి మాత్రం తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. వందల రూపాయలు చెల్లించనంత మాత్రాన ఇంతలా వేధించిన అధికారులు కోట్ల రూపాయలు బాకీ పడిన సంపన్నుల గడప కూడా ఎక్కడానికి సాహసించరు.
పట్టణ స్థానిక సంస్థలకు చెల్లించే ఆస్తి పన్ను పౌర సౌకర్యాల కల్పన కోసమేనని చట్టం చెబుతున్నా ఇల్లు లేదా వాణిజ్య ప్రాంగణం నుండి చెత్తను తీసుకెళ్లాలంటే చెత్త పన్ను చెల్లించి తీరాల్సిందేనని సర్కారు చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అదనపు అప్పు తెచ్చుకోవాలంటే చెత్త పన్ను వసూలు, విద్యుత్ రంగంలో సంస్కరణలు చేసి తీరాలని మోడీ ప్రభుత్వం విధించిన షరతులకు తలొగ్గి ఇటువంటి భారాలను ప్రజలపై మోపుతోంది. అదే సమయంలో స్థానిక సంస్థలకు పదిహేనవ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను వాటికి చెల్లించకుండా వేరే అవసరాలకు మళ్లించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగునా? అంతేగాక వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని నిర్మాణాలు, ఖాళీ స్థలాలపైన వసూలు చేస్తున్న ఆస్తి పన్నును రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్‌ఎంఎస్ లో జమ చేసుకొని సంబంధిత స్థానిక సంస్థకు సకాలంలో చెల్లించకపోవడం తప్పు కాదా? గతంలో వినోద పన్నును సినిమా హాలు యాజమాన్యాలు సంబంధిత స్థానిక సంస్థకే జమ చేసేవి. కాని, అది కూడా ప్రభుత్వ ఖజానాకే జమవుతోంది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ రుసుములతో పాటు వృత్తి పన్నుతో సహా అన్నీ ఆ బొక్కసం లోకే వెళ్తున్నాయి. కాని సంబంధిత స్థానిక సంస్థకు దామాషా ప్రకారం ఆయా మొత్తాలను ప్రభుత్వం చెల్లించడంలేదు. పైపెచ్చు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మేయర్/ ఛైర్ పర్సన్ వుండే వాటి పట్ల వివక్ష కూడా వ్యక్తమవుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఈ విధంగా పెద్ద బకాయిదారుగా వుంటూ ఎవరైనా గృహస్తులు లేదా చిన్న వ్యాపారులూ పన్ను చెల్లించనంత మాత్రాన ఇలా హింసించడం తగదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన తలసరి గ్రాంటుతో సహా అన్నిటినీ సకాలంలో మంజూరు చేస్తే స్థానిక సంస్థలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ ఉండవు కదా !
ఇదిలా వుండగా బ్యాంకులకు లక్షల కోట్లు బాకీ పడిన దేశ విదేశీ కార్పొరేట్లకు ఏకంగా రుణాలను మాఫీ చేయడం లేదా వన్ టైం సెటిల్‌మెంట్ పేరుతో అసలులో పది పదిహేను శాతం చెల్లిస్తే చాలు అని చెప్పే వైనం అందరికీ తెలిసిందే. ఇటువంటి వారి కోసమే ఒక బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని మోడీ సర్కారు నిర్ణయించింది. కాని చిన్న చిన్న మొత్తాలు చెల్లించలేని సామాన్యుల ఆస్తుల జప్తు, బహిరంగ ప్రకటనలు వంటివాటితో వారిని బజారుకీడుస్తుంటారు. పేద మధ్యతరగతి వారిని ఇబ్బందుల పాల్జేసే విధానాలను పాలకులు విడనాడాలి. ప్రజలను బాధించే చెత్త పన్ను (యూజర్ చార్జీ) విధానంపై ఇప్పటికే వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ప్రభుత్వానికి ప్రతికూలమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చియున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇలాంటి భారాలను ప్రజలపై వేస్తే ఆ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వానికే చుట్టుకుంటుందని వేరుగా చెప్పనక్కరలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేయాలి. లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.










