రామాయణం, మహాభారతంలో మహిళలను బలనిరూపణ ద్వారా దక్కించుకున్న సందర్భాలు అనేకం మనకు కనబడతాయి. విల్లును విరిచిన రాముడు, మత్స్యమును ఛేదించిన అర్జునుడు బల నిరూపణ ద్వారానే పరిణయమాడతారు. ధర్మరాజు జూదంలో ద్రౌపదిని పణంగా పెడతే, దుర్యోధనుడు తన తొడపై కూర్చోబెట్టుకోవాలనుకుంటాడు. యుద్ధాలు చేసి, రాజ్యాలను జయించి బలవంతంగానైనా రాణులను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారని చెప్పే కథలు కూడా మన దేశంలో అనేకం వున్నాయి. ఇక్కడెక్కడా స్త్రీకి సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలంటూ వుండవు. రాజ్యం వీర భోజ్యం అన్నట్టే... రాణి అంత:పుర కాంతగా మిగిలిపోయింది. వారి దష్టిలో స్త్రీ ఒక విలాస వస్తువు. పురాతన కాలం నాటి ఈ మూలాలను మనువాదులు తమకు ఆదర్శంగా మలుచుకున్నారు. 'న స్త్రీ స్వాతంత్య్ర మర్హసి' అని మతతత్వవాదులు రాసుకున్న మనువాదం...మహిళల పాలిట ఉన్మాదాస్త్రంగా మారింది. భూస్వామ్య విధానంలో సైతం మహిళలను మతం పేరుతో కట్టడి చేసిన మనువాదులు...ఇప్పుడు మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల గురించి సుద్దులు చెబుతూ...తమ ద్వంద్వ వైఖరినీ, రెండు నాల్కల ధోరణిని చాకచక్యంగా ప్రదర్శిస్తున్నారు.
ప్రపంచమంతా ఆధునికత వైపు దూసుకుపోతోందన్న మాట వాస్తవమే. అదే సందర్భంలో.. అంతే వేగంగా అమలు జరుగుతున్న సరళీకరణ ఆర్థిక విధానాలు స్త్రీని మార్కెట్‌గా, ఒక వస్తువుగా మార్చేశాయన్నదీ అంతే నిజం. 'ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది' అని గురజాడ వారు చెబుతారు. కానీ, స్త్రీ శక్తి యావత్తునూ మార్కెట్ కబళించేస్తోంది. లాభాలే పరమావధిగా మారిన పెట్టుబడిదారీ విధానం... స్త్రీని అంగాంగ ప్రదర్శన చేసే సరుకుగా తయారు చేసింది. టీవీల్లో వచ్చే దాదాపు అన్ని అడ్వర్టయిజ్మెంట్లలోనూ స్త్రీని ఒక వస్తువుగా చూపించేవే అధికం. మింటో ఫ్రెష్ నుండి డియోడరెంట్ల వరకు, మోటర్ బైక్ యాడ్ ల నుండి నగల యాడ్ ల వరకు అన్నింటిలోనూ స్త్రీని ఒక షో కేసులో బంధించిన జీవంలేని బొమ్మగా పెట్టుబడిదారీ సంస్కతి మార్చేసింది. దీనితో పాటు అరచేతిలోకి వచ్చిన సాంకేతికత..., ఇంటర్నెట్ సౌకర్యం... టెరాబైట్ల కొద్ది అశ్లీలతను మన మస్తిష్కాల నిండా నింపేసింది. చైనాలో తమ సొంత సాంకేతికతను ఉపయోగించి పోర్న్ సైట్లను కట్టడి చేశారు. మన దేశంలో పుంఖానుపుంఖాలుగా వచ్చిపడుతున్న పోర్న్ సైట్లను నియంత్రించలేకపోగా, అసెంబ్లీల్లోనూ, పార్లమెంటులోనూ ప్రజాప్రతినిధులే పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయిన సందర్భాలున్నాయి. విచ్చలవిడిగా దిగుమతి అవుతోన్న పోర్న్ వీడియోలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. మనిషిలోని పశుత్వానికి ఈ వీడియోలు ఆజ్యం పోస్తున్నాయి.
ప్రేమ పేరుతోనో, స్నేహం పేరుతోనో అమ్మాయిలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు అన్నిటికీ మూలాలు ఈ వ్యవస్థ నుండి పుట్టుకొచ్చినవే. ప్రేమించకపోతే చంపేస్తాననడం, యాసిడ్‌లు పోయడం, నేను ప్రేమించాను గనుక నన్ను ప్రేమించాల్సిందేననే భూస్వామ్య భావజాలం, యువతలో విశంఖలతను రెచ్చగొట్టే పెట్టుబడిదారీ సంస్కతి...వెరసి స్త్రీల పట్ల యమపాశాలుగా మారుతున్నాయి. ఈ తప్పు ఎవరిది? అనాదిగా బలప్రయోగంతోనైనా స్త్రీని లొంగదీసుకోవాలని మార్గం చూపుతున్న మనువాద సాహిత్యాన్ని పవిత్ర గ్రంథాలుగా ప్రమోట్ చేసే మతతత్వానిది, నయా ఉదారవాద విధానాలను పెంచి పోషిస్తోన్న పెట్టుబడిదారీ సంస్కతిది, విచ్చలవిడిగా దిగుమతి అవుతోన్న అశ్లీలాన్ని నియంత్రించలేని పాలకుల అసమర్థతది. ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు మూలాలను తెగనరకాల్సిన సమయం ఇది. ఈ సంస్కతిని రూపుమాపాల్సిన తరుణం ఇది. స్త్రీ పురుషులు సమానమనే సాంస్కతిక విప్లవం రావాలి.










