Jan 11,2022 08:28
  • రాష్ట్రవ్యాప్తంగా యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన
  • అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను బయటపెట్టండి

ప్రజాశక్తి - యంత్రాంగం : వేతనాలు తగ్గించే ఈ పిఆర్‌సి మాకొద్దని రాష్ట్రవ్యాప్తంగా యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసనలు తెలిపారు. 27 శాతానికి పైగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, అశుతోష్‌ మిశ్రా నివేదికను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. పలు జిల్లాలో కలెక్టర్‌, తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ విజయవాడలోని ఎంజి రోడ్డులో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కలుగజేసుకొని..నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఉపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు పోలీసులతో మాట్లాడారు. దీంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ..27 శాతంపైగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, అశుతోష్‌ మిశ్రా కమీషన్‌ నివేదికను బయటపెట్టి దానికి అనుగుణంగా నిర్ణయాలు చేయాలని డిమాండ్‌చేశారు. హెచ్‌ఆర్‌ఎలో శ్లాబ్‌లు తగ్గించకూడదని, ఉన్నవాటిని కొనసాగించాలని కోరారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శలు ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌, ఎ.కృష్ణ సుందరరావు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పిఆర్‌సి తమకొద్దంటూ విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ను ఎక్కువ శాతం ప్రకటించాలని, హెచ్‌ఆర్‌ఎ శ్లాబ్‌లను యథాతథంగా ఉంచాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు డి.రాము డిమాండ్‌ చేశారు.
    ఏ పిఆర్‌సిలోనూ జరగని అన్యాయం ఇప్పుడు చేశారని, చరిత్రలో వేతనాలు తగ్గించే పిఆర్‌సి ఇదొక్కటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఫిట్‌మెంట్‌ పెంచకపోతే భవిష్యత్తు పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బొబ్బిలి పట్టణంలోని ఎన్‌టిజి కార్యాలయం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి మాట్లాడారు. చీపురుపల్లి, భోగాపురంలో నిరసనలు తెలిపారు. కడప జిల్లాలో బద్వేలు, రాయచోటిలో ఆందోళనలు నిర్వహించారు.పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండల ఉపాధ్యాయులు తహశీల్దార్‌ కార్యాలయ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. భీమవరంలో నిరసన అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. దేవరపల్లిలో బస్టాండ్‌ వద్ద నిరసన తెలిపి ర్యాలీగా తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. నిడదవోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. చింతలపూడి ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సిపిఎస్‌ రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా కందుకూరు పోస్టాఫీస్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కిలారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో నంద్యాల, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, కోవెలకుంట్లలో నిరసన తెలిపారు.