Jun 14,2022 07:45

ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన 'ఇంటింటికీ సిపిఎం' కార్యక్రమంలో ప్రజలు తమ కష్టాలను వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కొనసాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను పార్టీ నేతల దృష్టికి తెచ్చారు. పింఛన్లు అందడం లేదంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వనుగుపల్లి వాసులు తెలిపారు. పనుల్లేక పస్తులు ఉంటున్నామని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. చింతపండు, జీడీ, మామిడి పంటలకు దిగుబడి రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పార్వతీ పురం మన్యం జిల్లాలో గిరిజనులు వాపోయారు. ధరల పెరుగుదల, పన్నుల భారాలు, తదితర స్థానిక సమస్యలను సిపిఎం బృందానికి వివరించారు.
 

                                                          పన్నుల భారాలు తగ్గించాలి

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు, కరెంట్‌, బస్‌ ఛార్జీలు, ఆస్తి, చెత్త పన్నుతో తమపై తీవ్ర భారం పడుతోందని కర్నూలు శ్రీరాం నగర్‌వాసులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఈ ఏడాది చింతపండు, జీడీ, మామిడి పంట దిగుబడి రాలేదని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ ఎదుట గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఆయిల్‌, కూరగాయలు కొనుగోలు చేసే పరిస్థితిలో లేమని తెలిపారు.
 

                                                   తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం

శ్రీకాకుళంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.జమలయ్య నాయకత్వంలో బృందం పర్యటించింది. నాగావళి నది చెంతనే ఉన్నా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని పెద్దరెల్లివీధి, రాయినగర్‌, మండలవీధి వాసులు సిపిఎం బృందం దృష్టికి తెచ్చారు. గతంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు మంజూరు కాలేదని, రహదారి సౌకర్యం కల్పించలేదని, శ్మశాన వాటికకు రోడ్డు లేదని కొత్తూరు మండలంలోని ఇరపాడు, ఇరపాడుగూడ, కొత్తగూడ గ్రామాల ప్రజలు వాపోయారు.
 

                                                            పింఛన్లు అందడం లేదు..

తాగునీరు, పోడు పట్టాలు, రేషన్‌, ఉపాధి బిల్లుల బకాయిలు, రోడ్లు తదితర సమస్యలను అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వనుగుపల్లి గ్రామ గిరిజనులు సిపిఎం నేతల దృష్టికి తెచ్చారు. 'చెత్తా చెదారంతో నిండిన వ్యర్థాలతో నీరు సరఫరా అవుతుంది.. ఆ నీటిని తాగడం వల్ల మలేరియా, డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నాం.. సమస్యను జివిఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.' అని విశాఖ జిల్లా జివిఎంసి 35వ వార్డు పరిధిలోని ద్రోణంరాజు సత్యనారాయణ కాలనీ వాసులు వాపోయారు.
 

                                              ఎన్ని అర్జీలు పెట్టినా.. పింఛన్‌ రావడం లేదు..

ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పింఛన్లు రావడంలేదని ప్రకాశం జిల్లా పొదిలి పట్టణం ప్రకాష్‌నగర్‌లో వితంతు, ఒంటరి మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఆచరణలో అమలు జరగడం లేదని దళితులు తెలిపారు.
 

                                                           టిడ్కో ఇళ్లు ఇవ్వడంలేదు

పారిశుధ్య నిర్వహణ సరిగ్గాలేదని, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వీధి లైట్లు వెలగడం లేదని, అర్హులకు పింఛన్లు రావడం లేదని, టిడ్కో ఇళ్లు ఇవ్వలేదని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని బ్రహ్మానందరెడ్డి కాలనీ, వడలివానిపేట, గౌతమ్‌నగర్‌ వాసులు నేతల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.
 

                                                                 సమస్యల వెల్లువ

అనంతపురం నగరంతో పాటు, జిల్లాలోని పామిడి, గుత్తి, సత్యసాయి జిల్లాలోని ధర్మవరం, సోమదేపల్లి, పరిగి, హిందూపురం ప్రాంతాల్లో ప్రజలు స్థానిక సమస్యలపై ఏకరువు పెట్టారు. డ్రెయినేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తుందని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మదన్‌సింగ్‌పేట వాసులు తెలిపారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇంటి స్థలాలు, డ్రెయినేజీ, విద్యుత్‌ తదితర సమస్యలను నెల్లూరు జిల్లా కావలి, కోవూరు, టిపి గూడూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు మండలాల్లో ప్రజలకు సిపిఎం బృందం దృష్టికి తెచ్చారు. ఉపాధి కూలీలకు మజ్జిగ, నీళ్లు ఏర్పాటు చేయడంలేదని, తాగునీరు, విద్యుత్‌ సమస్యలు ఉన్నాయని నంద్యాల జిల్లాలో ప్రజలు పార్టీ నేతలకు విన్నవించారు. రహదారులు, డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ప్రజలు సిపిఎం నేతల దృష్టికి తెచ్చారు.