Jan 01,2021 15:50

లక్నో : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రాస్‌ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ లక్సర్‌ను ఉదాసీనత కనబరుస్తున్నారంటూ అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయనను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనతో పాటు మరో 15 మంది అధికారులను కూడా వివిధ చోట్లకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. యుపిలోని జల్‌నిగమ్‌ అదనపు ఎండిగా వ్యవహరిస్తున్న రమేశ్‌ రంజన్‌ను హాధ్రాస్‌ జిల్లా కలెక్టర్‌గా యోగి సర్కార్‌ నియమించింది. హాథ్రాస్‌కు చెందిన ఓ దళిత బాలికపై గత ఏడాది సెప్టెంబర్‌ 14న ఉన్నత వర్గానికి చెందిన నలుగురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. తీవ్రగాయాల పాలైన యువతి చికిత్స పొందుతూ అదే నెల 29న మరణించారు. అనంతరం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి..యువతి మృతదేహానికి..మరుసటి రోజు అంటే సెప్టెంబర్‌ 30 అర్థరాత్రి... కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోకుండా..ఆమె స్వగ్రామానికి సమీపంలో అంత్యక్రియలు జరిపారు. దీంతో వివాదం చెలరేగింది. దీంతో ఈ కేసు సిబిఐకి బదిలీ అయింది.ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.