Oct 27,2020 16:05

లక్నో : దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన హథ్రాస్‌ సామూహిక అత్యాచారం కేసులో సిబిఐ దర్యాప్తుతో సహా అన్ని అంశాలను అలహాబాద్‌ హైకోర్టు పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు యుపి నుండి దేశరాజధాని కోర్టుకు మార్చాలన్న న్యాయవాదుల అభ్యర్థనను అలాగే ఉంచుతామని సుప్రీం కోర్టు  తెలిపింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఈ కేసు దర్యాప్తులో న్యాయం జరగదంటూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. బదిలీకి సంబంధించినంత వరకు, సిబిఐ ఈ కేసు విచారణను పూర్తి చేయడం సముచితమని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డే వ్యాఖ్యానించారు. విచారణ పూర్తి అయిన అనంతరం బదిలీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. సిబిఐ విచారణ చేపడుతున్నందున ఈ కేసుపై ఆందోళన అవసరంలేదని అన్నారు. ఈ పిటిషన్‌లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.