Oct 13,2020 20:59
న్యాయమూర్తి పర్యవేక్షణలో హథ్రాస్‌ కేసు దర్యాప్తు : ఐద్వా డిమాండ్‌

ఇండియా న్యూస్‌ నెట్‌వర్క-న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ సామూహిక అత్యాచారం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేస్తున్న దర్యాప్తు తీరుపై ఐద్వా ఆందోళన వ్యక్తం చేసింది. హథ్రాస్‌ కేసుపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరగాలని ఐద్వా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్‌ చేసింది. హథ్రాస్‌ ఘటనకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెబ్‌సైట్‌ నుంచి సిబిఐ తొలగించినట్లు వచ్చిన హిందూ పత్రిక కథనంపై ఐద్వా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం వ్యక్తం చేసింది. నోయిడా బ్రాంచ్‌ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ముందుగా కనిపించిందని, దానిలో సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించి ఐపిసి సెక్షన్‌ 302, ఎస్‌376డి కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొందని ఐద్వా తెలిపింది. కానీ ఇప్పుడు ఆ ఎఫ్‌ఐఆర్‌ను తొలగించినట్లు తెలుస్తోందని పేర్కొంది. అత్యాచారం గానీ హత్య గురించి చేర్చని హథ్రాస్‌ పోలీస్‌స్టేషన్‌ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు సిబిఐ ప్రస్తుతం తన వెబ్‌సైట్‌లో చూపిస్తోందని తెలిపింది. ఇటువంటి పరిస్థితుల దఅష్ట్యా ఈ కేసులో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరగాలని ఐద్వా డిమాండ్‌ చేసింది.