ప్రజాశక్తి-తిరుపతి : మహిళలను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాను తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తిరుపతిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎస్సై కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి డాక్టర్ పి సాయి లక్ష్మి, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మహిళలను ఉద్దేశించి... చీరలో, సూట్, సల్వార్ లలో బాగుంటారని, తనకైతే ఏమి వేసుకోకున్నా బాగుంటారని మహిళలను కించపరస్తూ వ్యాఖ్యలు చేసారని తెలిపారు. రాందేవ్ బాబాపై కేసు నమోదు చేయాలని కోరారు. ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది పరిపాటిగా మారిపోయిందని తెలిపారు. అనేకమంది బాబాలు మహిళల పట్ల కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినప్పటికీ వారిపైన కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. ప్రతిరోజు ఏదో సందర్భంగా ఇలాంటి బాబాలు, గరికిపాటి లాంటి వ్యక్తులు మహిళలు కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని జాతీయ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసును తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి నదియా, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయంతి పాల్గొన్నారు.










