లక్నో : హథ్రాస్ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి జెఎన్ మెడికల్ కాలేజీ (జెఎన్‌ఎంసి) చెందిన ఇద్దరు వైద్య అధికారులను ప్రభుత్వం తొలగించింది. ఇటీవల హథ్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యంత పాశవికంగా జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బాధితురాలిపై అత్యాచారం జరిగిందంటూ ఒక అధికారి పోలీసుల వాదనకు విరుద్ధంగా బహిరంగంగా పేర్కొన్నారని, ఆ మహిళకు సంబంధించిన కొన్ని నివేదికలపై సంతకం చేశారంటూ మరో అధికారిపై వేటు వేసింది. సోమవారం అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (ఎఎంయు)కి చెందిన జెఎన్‌ఎంసిలోని వైద్యులను, సిబ్బందిని సోమవారం సిబిఐ అధికారులు విచారించిన అనంతరం ఈ వేటు పడటం గమనార్హం. అత్యాచారం జరగలేదంటూ అదనపు డిజిపి (శాంతి భద్రతలు) ప్రశాంత్ కిషోర్ వాదనను తోసిపుచ్చడంతో జెఎన్‌ఎంసి తాత్కాలిక ప్రధాన వైద్య అధికారి (సిఎంఒ) అజీమ్ మాలిక్‌పై వేటు పడింది. ఫోరెన్సిక్ నివేదికకు ఎలాంటి విలువ లేదని, బాధితురాలిపై అత్యాచారం అనంతరం 96 గంటల్లోనే ఆధారాలు కనుగొనే అవకాశం ఉందని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని, అయితే పోలీసులు 11 రోజుల అనంతరం శాంపిళ్లను సేకరించారని మాలిక్ పేర్కొన్నారు. 'జెఎన్‌ఎంసి వైద్యులు చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నపుడు, కరోనా మహమ్మారి సమయంలో రెండున్నర నెలలు సేవలందించేందుకు వైద్యునిగా చేరాను. కాని నా సేవలు అవసరం లేదంటూ మంగళవారం ప్రభుత్వం తొలగించిందని డాక్టర్ ఒబాయిద్ ఇంతియాజియుల్ హక్ అన్నారు. హథ్రాస్ బాధితురాలి కేసుపై విచారణ జరుగుతున్నందున బాధితురాలి గురించి మీడియాలో చర్చించలేదని అన్నారు. అయితే బాధితురాలికి సంబంధించిన కొన్ని వైద్య పత్రాలపై సంతకం చేశానని అన్నారు. వైద్యులను తొలగించడం సాధారణ ప్రక్రియేనని ఎఎంయు అధికారులు పేర్కొన్నారు. జెఎన్‌ఎంసిలోని చాలామంది వైద్యులు అనారోగ్యానికి గురైన అనంతరం ఆస్పత్రిలో వైద్యుల అవసరం ఉన్నందున డాక్టర్ మాలిక్, హక్‌లను సెలవు ఖాళీల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు రెగ్యులర్ వైద్యులు రావడంతో వారిని తొలగించామని ఇది సర్వసాధారణమేనని ఎఎంయు ప్రతినిధి ప్రొఫెసర్ షాఫి కిడ్వై చెప్పారు.










