ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సోమవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కళాబృందాల కోలాటాలు ఆకట్టుకున్నాయి. శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నవనీత కష్ణాలంకారంలో రాములవారు ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. యాత్రికులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు. సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు యాత్రికులకు దర్శనమిచ్చారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచాయి. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్‌బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఎఇఒ గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ, విశేష సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు.










