పోర్ట్-అవు- ప్రిన్స్ : హైతీ ప్రభుత్వం ఏరియల్ హెన్రీని మంగళవారం అధికారికంగా ప్రధానిగా నియమించింది. రెండు వారాల క్రితం హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాజధాని పోర్ట్ - అవు- ప్రిన్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో హెన్రీ బాధ్యతలు స్వీకరించారు. మాజీ అధ్యక్షుడి మృతిపై ఒక నిమిషం పాటు మౌనం పాటించిన అనంతరం ఆయన ప్రసంగించారు. హింసాత్మక శక్తులను రెచ్చగొడుతున్న వారిపై హైతీ ప్రస్తుతం పోరాడుతోందని అన్నారు. ఇటీవల నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో అత్యధిక మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలని తాను భావిస్తున్నానని అన్నారు. దేశ ఐక్యతను, స్థిరత్వాన్ని చూపాల్సిన సమయమిదేనని చెప్పారు. మాజీ ప్రధాని క్లాడ్ జోసెఫ్ మాట్లాడుతూ.. హెన్రీ నియామకం ఎన్నికలను అనుకూల పరిస్థితులను కల్పించేందుకు ఉద్దేశించబడిందని, ముందుకు సాగడం కష్టమని అన్నారు. 2016లో చివరిసారిగా హైతీలో ఎన్నికలు జరిగాయి.










