Nov 25,2021 06:14

- బి. ప్రభావతి
మహిళలపై, చిన్నారులపై రోజురోజుకి పెరుగుతున్న లైంగిక దాడులకు అంతం లేకుండా పోతోంది. దళిత గిరిజన మహిళలపై 65 శాతం నేరాలు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కాలంలో కూడా 80 శాతం గృహ హింస పెరిగింది.
మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గుచేటు. పని ప్రదేశాల్లో లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన నేరాలలో దేశంలో మన రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. ఏలినవారు ఎన్ని దిశా యాప్‌లు తెచ్చినా నేర రేటును మాత్రం తగ్గించడంలో విఫలమయ్యారు. ఏ రోజు ఏ పేపరు చూసినా చిన్నారులు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయి.
రాజ్యాంగం కల్పించిన హక్కు సమాన పనికి సమాన వేతనం 4 శాతం సంఘటిత రంగంలో తప్ప ఎక్కడా అమలు కాలేదు. ఎక్కువ పని గంటలు తక్కువ వేతనం ఇవ్వడంతో 98 శాతం అసంఘటిత రంగంలో పని చేస్తున్న మహిళలు శ్రమదోపిడికి గురవుతున్నారు. ఇది కూడా హింస కిందకే వస్తుంది. పని ప్రదేశాల్లో భద్రత లేక లైంగిక వేధింపులకు గురవుతున్నారు. 1986 విశాఖ తీర్పులో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయమని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికి అది అమలు కావడం లేదు. ఆడపిల్ల పట్ల వివక్షత నేటికి కొనసాగుతున్నది. స్త్రీ వ్యాపార వస్తువుగా, సరుకుగా మారిపోయింది. దుర్ఘటన జరిగిన ప్రతిసారి ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలు చేపట్టడం తప్ప మూలాల్లోకి వెళ్ళి విష సంస్కృతిని నాశనం చేసే చర్యలు చేపట్టలేదు. టీవీల్లో వస్తున్న బహుభార్యల సీరియళ్లు గృహ హింస పెరగడానికి తావిస్తున్నాయి.
మరోపక్క మహిళలు బయటకు రాకూడదని, దుస్తులు సరిగ్గా వేసుకోకపోవడం వల్లే ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయిని మనువాద భావజాలం కలిగిన బిజెపి కేంద్రమంత్రుల వ్యాఖ్యానిస్తున్నారు. 'భారతమాతకు జై' అన్నవారే స్త్రీలను కించపరచడం బి.జె.పి రెండు నాలుకల ధోరణికి అద్దం పడుతున్నది. బి.జె.పి పాలిత రాష్ట్రాలు హింసలో మొదటి వరసలో వున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి గంటకు దేశ వ్యాప్తంగా నలుగురి మహిళలపై లైంగిక దాడులు, ప్రతి పది నిమిషాలకు ఒక కిడ్నాప్‌ జరుగుతున్నది. మమ్మల్ని గెలిపిస్తే బాల్య వివాహాలు చేయిస్తామని బి.జె.పి మంత్రులు ఏకంగా తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొనడం తిరోగమన భావజాలానికి ప్రతీక. యు.పి లో సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మహిళలు పోలీస్‌ స్టేషన్‌కు రావద్దని చెప్పడం... ధర్మం అక్కడ మూడు పాదాల మీద నడుస్తుందనడానికి నిదర్శనం. పైగా స్త్రీలు బయటకు రావాలంటే పురుషుని తోడు వుండాలని చెప్పడం మనువాదానికి అద్దం పడుతుంది. మగవాడు తోడు ఉండాలంటే ఆడపిల్లలు ఈ దేశానికి పతకాలు సాధించడం సాధ్యమవుతుందా!
ఇటీవల హర్యానాలో జీన్స్‌ వేసుకుందని పద్దెనిమిదేళ్ల అమ్మాయిని కొట్టి చంపేరు. ఆసిఫా, కులదీప్‌కౌర్‌ మన రాష్ట్రంలో రమ్య, పావని, వరలక్ష్మి, రష్మిత ఇలా ఎందరో అమాయకులు మృగానందానికి బలైపోయారు. నిర్భయ చట్టం సక్రమంగా అమలుకాక బాధిత మహిళలు దౌర్భాగ్య పరిస్థితుల్లో జీవచ్ఛవాల మాదిరిగా జీవిస్తున్నారు. మహిళా రక్షణ చట్టాలను సైతం నీరుకారుస్తున్నారు. ఎటువంటి వివాదాల్లోనైనా స్త్రీలను లక్ష్యంగా చేసుకొని వారిపై దాడులు చేస్తున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళంలో లకీëపురం, గతంలో కారంచేడు, ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన ఘటన. ఇవి మచ్చుకు మాత్రమే.
ఆధునిక స్త్రీ చరిత్రను తిరిగి రాస్తుందన్న గురజాడ మాటలు నిజం కావాలి. మహిళలు, విద్యార్థులు, మేధావులు, అభ్యుదయవాదులు కలసికట్టుగా హింస లేని సమాజం కోసం పోరాడాలి. స్త్రీల హక్కులను రక్షించాలంటే స్త్రీల శక్తి సామర్ధ్యాలను సామాజిక ఉత్పత్తిలో భాగం చేయాలి. మనువాద భావజాలాన్ని తిప్పికొట్టాలి. మహిళల హక్కులన్నీ మానవ హక్కులే. ఈ భావాన్ని ప్రభుత్వం కూడా ప్రచారం చేసి అమలుకు పూనుకోవాలి. జస్టిస్‌ వర్మ సిఫార్సులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి. మహానగరాల్లో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను విస్తృతంగా పెట్టడమేగాక... శిక్షలు కఠినంగా అమలు చేయాలి. రాజ్యాంగ యంత్రం, పోలీసు వ్యవస్థ మహిళల సమస్య పట్ల సున్నితంగా వ్యవహరించాలి. స్త్రీ, పురుషులు సమానమే అన్న భావాన్ని పెంపొందించాలి. ఇంటర్నెట్‌లో వస్తున్న విష సంస్కృతిని, పోర్న్‌ చిత్రాలను నిషేధించాలి. ఎమ్మెల్యేలు సైతం ద్వంద్వ అర్ధాలతో మహిళలను కించపరచేలా మాట్లాడడాన్ని నిషేధించాలి.
ఇటీవల ముంబాయి కోర్టులో దుస్తులు పైనుండి తాకితే లైంగిక వేధింపు కాదని తీర్పునివ్వడం ఫ్యూడల్‌ భావజాలానికి అద్దం పడుతుంది. అయితే దుస్తుల పైనుండి తాకినా లైంగిక వేధింపులకు వస్తుందని ఇటీవలే సుప్రీంకోర్టు చెప్పడం దేశంలో కొంతమేరకైనా ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవచ్చు. చూపులతో గాని, మాటలతో గాని గాయపరిచే చేష్టలను హింసగానే పరిగణించాలి. అందరం చేయి చేయి కలిపి కృషి చేస్తేనే హింస లేని సమాజం సాధ్యమౌతుంది.


/ వ్యాసకర్త : ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు /