Jan 09,2022 11:11
  • విద్యా విధానంలో అన్ని రాష్ట్రాలూ కేరళను ఆదర్శంగా తీసుకోవాలి 

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో, క్యాంపస్‌ : హిందుత్వాన్ని బలపరిచే విద్యావిధానాలను వ్యతిరేకించాలని అఖిల భారత విశ్వవిద్యాలయాలు, కళాశాల అధ్యాపకుల సంఘం (ఐఫ్యాక్టో) నేతలు పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ కేరళ విద్యావిధానాలను ఆదర్శంగా తీసుకోవాలని, అప్పుడే సామాన్యులకు విద్య అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షించారు. తిరుపతి ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఐఫ్యాక్టో 31వ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆ సంఘం జాతీయ నేతలతో 'ప్రజాశక్తి' మాట్లాడింది.
 

                                                                  కేరళలో ఉన్నత విద్య భేష్‌

11
               సి.పద్మనాభన్‌, ఐఫ్యాక్టో జాతీయ కార్యదర్శి

కేరళలో ఉన్నత విద్య భేషుగ్గా ఉంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తోన్న విధానాలే ఇందుకు కారణం. విద్యారంగం సమూల మార్పులపై కేరళ ప్రభుత్వం మూడు కమిషన్లను వేసింది. ఈ నివేదికల ఆధారంగా సాధారణ ప్రజలకు అనుకూలంగా విద్యావిధానాలను తీసుకొచ్చింది. విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ కళాశాల్లో అధ్యాపకులను పూర్తి స్థాయిలో నియమించింది. యుజిసి పే స్కేల్స్‌ అమలు చేస్తోంది. గత మూడు సంవత్సరాల్లో ప్రైవేటు కళాశాలలో చదివే లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థలలో చేరారు. కోవిడ్‌ పరిస్థితుల్లో కూడా కేరళ రాష్ట్రంలో అకడమిక్‌ కేలండర్‌ను కచ్చితంగా పాటించి విద్యా వ్యవస్థ కుంటుపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్‌, డిగ్రీ విద్యా సంస్థల బలోపేతానికి నవకేరళ మిషన్‌ ప్రాజెక్టులను ప్రారంభించి అక్కడి అవస్థాపనా సౌకర్యాలను ప్రపంచ స్థాయి విద్యాసంస్థలతో పోటీ పడే విధంగా రూపుదిద్దారు.
                                                                                

                                                         విద్య ప్రైవేటీకరణే ఎన్‌ఇపి ప్రధాన లక్ష్యం

- ఆచార్య కేశవ భట్టాచార్య, ఐఫ్యాక్టో అధ్యక్షుడు
             - ఆచార్య కేశవ భట్టాచార్య, ఐఫ్యాక్టో అధ్యక్షుడు                 

విద్యను ప్రైవేటుపరం చేయడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చింది. విద్యావ్యవస్థను కోవిడ్‌ మహమ్మారి ఎంతో ప్రభావితం చేసింది. నూతన విద్యా విధానంలో లోపాలను ప్రధానంగా ఈ సదస్సులో చర్చించాం. కేంద్రం ప్రభుత్వం దేశంలోని రైల్వేలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోంది. విద్యావిధానంలో కూడా మార్పులు తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని కార్పొరేట్లకు పూర్తి అనుకూలంగా రూపొందించింది. ఇటీవల నాక్‌ కమిటీ రిలయన్స్‌ సంస్థకు చెందిన ఒక విద్యా సంస్థను గ్రీన్‌ఫీల్డ్‌ యూనివర్సిటీగా ప్రకటించింది. అయితే, అది ఎక్కడ ఉందో, విద్యార్థులు, అధ్యాపకులు ఎవరో అనే సమాచారం లేకపోవడం దారుణం. హిందుత్వ విద్యను తీసుకొచ్చేందుకు మోడీ సర్కార్‌ ప్రయత్నిస్తోంది.
 

                                                            నూతన విద్యావిధానం లోపభూయిష్టం

- ఆచార్య అరుణ్‌ కుమార్‌, ఐఫ్యాక్టో కార్యదర్శి
                      - ఆచార్య అరుణ్‌ కుమార్‌, ఐఫ్యాక్టో కార్యదర్శి

నూతన విద్యా విధానం-2020 లోపభూయిష్టంగా ఉంది. ఈ విద్యా విధానం రూపొందించే సమయానికి దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ పేరుతో విద్యావేత్తలతోగానీ, విద్యార్థి నేతలతోగానీ కేంద్ర ప్రభుత్వం చర్చించలేదు. నూతన విద్యా విధానాన్ని దేశంలో అమలు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మూతబడే పరిస్థితులు ఏర్పడతాయి. భవిష్యత్తులో విద్యా వ్యవస్థను ప్రైవేట్‌పరం చేయాలనే దక్పథంతోనే నూతన విద్యావిధానం తీసుకొచ్చారు. హిందుత్వాన్ని విద్యావ్యవస్థలో జొప్పించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ విద్యా విధానం రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ విద్యా విధానంలోని లోపాలను సవరించి దేశ అభివద్ధికి అవసరమైన విద్యా విధానాన్ని రూపొందించడానికి తగిన సూచనలు, సలహాలు ఈ సదస్సులో తీసుకుంటాం.