Apr 29,2023 21:22

- మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పీలేరు : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం 98.44 శాతం నెరవేర్చిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని పలు గ్రామాల్లో శుద్ధ నీటి ప్లాట్లను ప్రారంభించారు. పీలేరు గ్రామ పంచాయతీ భవనం మొదటి అంతస్తును కూడా ప్రారంభించారు. అనంతరం స్థానిక కడప రోడ్డులోని ఎంఎం ఫంక్షన్‌ హాల్లో జరిగిన పీలేరు, కె.వి.పల్లె మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలోనూ మంత్రి పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని, డ్వాక్రా రుణాలతో పాటు రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చాడని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటలు తుంగలో తొక్కాడని చెప్పారు. అవసరానికి ఓ మాట చెప్పి ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబు నైజమన్నారు. బాబు మాటలు నమ్మి ప్రజలు ఎవరూ బోల్తా పడవద్దని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో అభివద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పీలేరు మండలంలో 50 శుద్ధ నీటి ప్లాంట్ల ఏర్పాటు జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రూ.2,400 కోట్లతో వైయస్సార్‌ జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌ నుంచి వెనుకబడిన నియోజకవర్గాలైన పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, రాయచోటికి తాగు, సాగునీరు అందివ్వనున్నామని చెప్పారు. సదుం మండలంలోని ఆవులపల్లి రిజర్వాయర్‌ నుంచి రూ.672 కోట్ల వ్యయంతో సదుం, సోమల, పులిచర్ల రొంపిచర్ల, పీలేరు మండలాలకు తాగునీరు అందివ్వనున్నట్లు తెలియజేశారు. ఈ సందఠంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రయ్య అనే వ్యక్తికి రూ.4 లక్షలు, వెంకట లక్ష్మమ్మ అనే మహిళకు 2.25 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాన్‌, ఏపిఎండిసి డైరెక్టర్‌ హరీష్‌ రెడ్డి, పీలేరు ఎంపీపీ కంభం సతీష్‌ కుమార్‌ రెడ్డి, సర్పంచ్‌ డాక్టర్‌ షేక్‌ హబీబ్‌ బాష, జడ్పీటీసీ ఏటి రత్నశేఖర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎండి షఫీ, పీలేరు నియోజకవర్గ పరిశీలకులు సహదేవరెడ్డి, అన్నమయ్య జిల్లా మహిళా కన్వీనర్‌ మహిత ఆనంద్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కారపాకుల భాస్కర్‌ నాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్‌ రెడ్డి, నల్లారి తిమ్మారెడ్డి, పీలేరు, కె.వి పల్లి మండలాల ప్రజా ప్రతినిధులు, వైసిపి కార్యకర్తలు, జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రికి పీలేరు పంచాయతీ కార్యాలయం వద్ద, దొడ్డిపల్లి వద్ద గజమాలలతో స్వాగతం పలికారు.