ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : కష్ణాష్టమి పురస్కరించుకొని ఎనికేపాడులోని విజ్ఞాన విహార ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమానికి బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ శేషశ్రీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగవద్గీత గ్రంథాన్ని ఒక ఆధ్యాత్మిక గ్రంథంలా కాకుండా క్రమశిక్షణ కలిగిన మానవ జీవితానికి ఒక దిక్సూచిలా విద్యార్థులు భగవద్గీత సారాంశాన్ని అవపోసన పట్టాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతి కార్యక్రమాలు ఉల్లాసంగా సాగాయి. రాధ, కష్ణుడు, గోప గోపికల వేషధారణతో విద్యార్థులు ప్రేక్షకులను ముగ్ధుల్ని చేశారు. పలువురు విద్యారంగ ప్రముఖులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.వి.ఎస్.ఎస్.ఎం. లక్ష్మి, ఉప ప్రధానోపాధ్యాయురాలు జి శైలజ తదితరులతో సహా అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దుర్గగుడిలో కృష్ణాష్టమి వేడుకలు
వన్‌టౌన్ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానంలో బుధవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, చింకా శ్రీనివాసరావు పాల్గొన్నారు. సాయంత్రం 6:30 గంటల నుండి 7 గంటల వరకు దేవస్థాన పురాణ పండితులచే ఉపన్యాసం జరిగింది. అనంతరం ఉట్టి కొట్టు వేడుకులు రాజగోపురం ముందు భాగమున గల ఖాళీ ప్రదేశం నందు నిర్వహించారు.
మైలవరం : కష్ణాష్టమి వేడుకలను బుధవారం మైలవరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వివేకానంద పాఠశాల ఎస్‌ఎస్‌కె, శ్రీ లీలావతి పబ్లిక్ పాఠశాలలో చిన్నారులకు శ్రీకష్ణ జన్మ వృత్తాంతం గురించి వివరించారు. చిన్నారులచే ఉట్టి కొట్టించారు. ఈ సందర్భంగా లీలావతి పబ్లిక్ స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉడుత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతదేశ సంస్కతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కరస్పాండెంట్ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట : పట్టణంలో శ్రీకష్ణ మందిరంలో బుధవారం ఘనంగా శ్రీ కష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా దేవాలయ ప్రాంగణంలో యాదవ కుటుంబీకులచే ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కమిటీ తెలిపింది. అనంతరం శ్రీ కష్ణాష్టమిని పురస్కరించుకొని సంతాన వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం మరియు తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు దేవాలయంలో భక్తులు పోటెత్తారు.










