Feb 28,2023 21:54

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న టైలర్స్‌

ఘనంగా ఆత్మకూరులో టైలర్స్‌ డే
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు టైలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్రం సెంటర్‌ నుండి బి.ఎస్‌.ఆర్‌ సెంటర్‌ వరకు సభ్యులందరూ పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. మొదటగా సత్రం సెంటర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసే నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్‌ బస్టాండ్‌ వరకు మేళతాళాలు బాణసంచాలతో తమ ఆనంద కేరింతల నడుమ టైలర్స్‌ ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడి నుండి బిఎస్‌ఆర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ కొనసాగించి అక్కడ తమ సమస్యల గురించి ప్రసంగించారు.
రెండు తరాల నుండి సుమారు 40 ఏళ్లకు పైగా ఆత్మకూరు పట్టణంలో ఉన్న వందలాది టైలర్స్‌ కుటుంబాలకు నేషనల్‌ హైవే పక్కన ఇళ్ల స్థలాలను ఇచ్చి ఉన్న ఇప్పటివరకు వాటిని తమకు అందజేయకుండా అడ్డుపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇల్లు నిర్మించుకోవడానికి వెళ్లిన ప్రతిసారి అధికారులు ఏదోక సాకు పెడుతూ తమను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా దయచేసి తమ ఇళ్ల స్థలాలలో తాము ఇల్లు కట్టుకునేందుకు అనుమతించాలని, అలాగే తమ సమస్యలతో చర్చించుకునేందుకు ఒక కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలం ఇవ్వాలని వారు కోరారు. ర్యాలీ అనంతరం బిఎస్‌ఆర్‌ సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేసి టైలర్స్‌ ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కార్యవర్గ పెద్దలు గౌస్‌ మొహిద్దీన్‌, రవూఫ్‌, శ్రీను, రఫీ, ఇంతియాజ్‌, గోరి సుల్తాన్‌, రహీం, గోపాల్‌ తదితరులు హాజరయ్యారు.