Mar 03,2023 22:39

పెనుకొండలో వినూత్న నిరసన తెలుపుతున్న నాయకులు

పెనుకొండ : పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలన్న డిమాండ్‌తో సిపిఎం నాయకులు శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సిలిండర్లు పక్కనపెట్టి కట్టెలు పొయ్యి పెట్టుకొని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు అనేక హామీలిచ్చిన మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని విమర్శించారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు ఇస్తూ సామాన్య, పేద ప్రజలను ఆర్థిక ఇబ్బందులు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిప్పన్న ,బాబావలి, మహబూబ్‌ బాషా, మూర్తి , సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప, రెడ్డప్పరెడ్డి, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : గ్యాస్‌ ధరల పెంపుపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. శుక్ర వారం కదిరి పట్టణంలోని శివాలయం వీధిలో ఐద్వా, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర ధరలతో ఇబ్బందులు పడుతుంటే గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ పై 50 రూపాయలు పెంచడం దుర్మార్గమన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్‌ ధరలను పెంచడం అలవాటుగా మార్చుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు శాంతిబాయి, హేమలత, బాబులమ్మ, అమరావతి, రమాదేవి, సిఐటియు నాయకులు జగన్మోహన్‌, రామ్మోహన్‌, కష్ణానాయక్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.