Sep 24,2020 07:36

జాతి భవితకు అత్యంత కీలకమైన విద్యారంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మాటల్లో భారీ లక్ష్యాలను వల్లె వేస్తున్న నేతలు ఆచరణలో దానికి భిన్నంగా రిక్తహస్తాలను చూపుతున్నారు. ఏ విద్యార్థి అయినా ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఉపాధ్యాయులు అత్యంత కీలకమన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే, తల్లి, తండ్రి తరువాత అంతటి స్థానాన్ని గురువుకు కట్టబెట్టిన సంస్కృతి మనది! కానీ, ఆ ఉపాధ్యాయులు సర్కారు నిర్లక్ష్యానికి సమిధలుగా మారి ఈసురోమంటుంటే చిన్నారులు ఉత్తమ పౌరులుగా ఎలా తయారవుతారు?
దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో రాష్ట్రంలో ప్రైవేటు విద్య తామర తంపరగా పెరిగిపోయింది. కె.జి నుండి పి.జి వరకు ప్రైవేటు సంస్థలదే హవా! ఒక అంచనా ప్రకారం ఐదు లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు ఈ సంస్థల్లో పని చేస్తున్నారు. వీరందరికి కరోనా జీవిత కాలపు విషాదాన్ని మిగిల్చింది! ఏమాత్రం ముందస్తు కసరత్తు లేకుండా విధించిన లాక్‌డౌన్‌ కాలంలో వీరిలో ఎవరికి ప్రైవేటు యాజమాన్యాలు జీతాలు ఇవ్వలేదు. కూరగాయలు అమ్ముతూ, కూలీనాలి చేస్తూ బతుకుపోరు చేస్తున్న ఉపాధ్యాయల గురించి పత్రికల్లో ఎన్నో వార్తా కథనాలు వచ్చినా సర్కారులో నామమాత్రపు స్పందన లేదు. వృత్తి విద్యను బోధించే ప్రైవేటు కళాశాలల్లో దాదాపు 40 వేల మంది ఉపాధ్యాయులను యాజమాన్యాలు కరోనా సాకుతో ఇంటికి పంపించేశాయి. వీరి పరిస్థితి అగమ్యగోచరం. ఆరు నెలలుగా వీరి బతుకులు ఆగమాగం అవుతుంటే ఏలినవారికి చీమ కుట్టినట్టు కూడా ఎందుకు లేదు? కార్పొరేట్‌ విద్యా సంస్థల నుంచైనా జీతాలు ఇప్పించడానికి చొరవెందుకు చూపలేదు?
ప్రభుత్వ రంగం లోని పాఠశాలు, కళాశాలల్లో పని చేసే వేలాది మంది కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు, లెక్చరర్లది కూడా భిన్నమైన స్థితేం కాదు! గత ఏడాది 12 నెలలకు పునరుద్ధరించిన వీరి కాంట్రాక్టును కరోనా విరుచుకుపడిన తరువాత సాంకేతిక కారణాలు చూపుతూ ప్రభుత్వం పది నెలలకే పరిమితం చేసింది. అదీ చాలదన్నట్టు గడిచిన ఆరు నెలలుగా ఒక్క రూపాయీ చెల్లించలేదు. అధికారుల నుండి మంత్రులు, చివరికి ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యం. కడుపు నింపుకోవడమే కష్టమైతే భవితకు బాటలు వేసేది ఎలా? వీరికి చెల్లించాల్సిన జీతాలు ఎప్పుడిస్తారు? అసలు ఇచ్చే ఆలోచన ఉందా?
ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులవి మరో రకమైన కష్టాలు! కరోనా వ్యాప్తి కొనసాగుతుండగానే, సందేహాలు తీర్చే పేరిట విద్యా సంస్థలను తెరిచి తీరాలంటూ జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ ప్రభుత్వానిది ఏకపక్ష వైఖరే! పోనీ విద్యా సంస్థల వద్ద రక్షణ చర్యలు పకడ్బందీగా తీసుకున్నారా, వాటికి అవసరమైన నిధులు విడుదల చేశారా అంటే అదీ లేదు! విద్యార్థులకో, ఉపాధ్యాయులకో వైరస్‌ వస్తే, జరగరానిది ఏదన్నా జరిగితే బాధ్యత ఎవరిదన్న ప్రశ్నకు జవాబు లేదు! ఇదొక్కటే కాదు, ఈ ఏడాది నిర్వహించిన విద్యార్థుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇలాగే సాగింది. ఫలితంగా విద్యార్థులు ఎక్కువగా ఉండే పెద్ద పాఠశాలల్లో చాలీచాలని స్థాయికి ఉపాధ్యాయుల సంఖ్య పడిపోయింది. ఇదేమని అడిగితే తప్పు దిద్దుకోవడానికి బదులుగా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఆగిన బదిలీలను ఈ ఏడాది చేపట్టాలని నిర్ణయించడం ఆహ్వానించదగినదే! కానీ, ఈ ప్రక్రియ లోనూ ఏకపక్ష ధోరణే కొనసాగుతోందన్న విమర్శలు ఇప్పటికే వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించలేదు. మరోవైపు పైరవీల బదిలీలు ఇప్పటికే జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. విద్యా రంగం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ అస్తవ్యస్త స్థితిని సరిదిద్దాలి. ప్రభుత్వ రంగమైనా, ప్రైవేటు రంగమైనా ఉపాధ్యాయుల బతుకులకు భరోసా ఇవ్వాలి. నెలల తరబడి పస్తులతో పడి ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక తోడ్పాటునివ్వాలి!