May 04,2023 22:02

సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌

ప్రజాశక్తి-హిందూపురం : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరుగుతున్న గృహ నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వేగవంతంగా పనులను పూర్తి చేయించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ ఆదేశించారు. పురపాలక సంఘ వ్యాప్తంగా ఉన్న సచివాలయ అమ్యూనిటి సెక్రటరీలు, వార్డు వాలంటీర్లతో మున్సిపల్‌ కార్యాలయంలో పురపాలక సంఘ వ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లనిర్మాణంలో అమ్యూనిటీ సెక్రటరీలు హౌసింగ్‌ అధికారులతో సమన్వయం చేసుకుని వేగవంతంగా పనులు పూర్తి అయ్యే విధంగా చూడాలన్నారు. ఆప్షన్‌ ఒకటి, రెండు కింద నిర్మాణం జరుగుతున్న ఇళ్ల నిర్మాణలపై శ్రద్ధ పెట్టి పని చేయాలన్నారు. హౌసింగ్‌ కింద కావాల్సినంత డబ్బు ఉందన్నారు. మెటీరియల్‌ అంతా అందుబాటులో ఉందన్నారు. లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పన జరుగుతోందని అన్ని రకాలుగా అనుకూల పరిస్థితి ఉన్నా, ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి ఎందుకు తక్కువగా ఉందని ప్రశ్నించారు. ఇకపై ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సాకులు చెప్పడానికి వీలులేదన్నారు. ఎక్కువ ఇళ్లు ఇంకా పునాదులు కూడా పడని పరిస్థితుల్లో ఉన్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో పని చేయని వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి ఇల్లు ఎందుకు కట్టలేదు అనేది అడగాలన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన స్థలంలో ఇల్లు కట్టలేదంటే వారి స్థలంతో పాటు, ఇల్లు కూడా రద్దు అవుతుందన్న విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా 6781 ఇళ్లు మంజూరు కావడం జరిగిందన్నారు. ఇందులో ఆప్షన్‌ ఒకటి, రెండు కింద 351, ఆప్షన్‌ మూడు కింద 5854, సొంత స్థలాలు ఉండి ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 576 మంది ఉన్నారన్నారు. ఇందులో ఆప్షన్‌ మూడు కింద ఇప్పటి వరకు 5713 ఇళ్ల నిన్మాణాలకు పునాది వరకు పనులు జరిగాయనిఆప్షన్‌ ఒకటి, రెండు కింద నిర్మాణాలు చేస్తున్నా వారు ముందుకు రావడం లేదని అన్నారు. వారి గృహ నిర్మాణాల కోసం నిధులు పుష్కలంగా ఉన్నాయని వివరించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం రూ.1.80లక్షలు ఇవ్వడంతో పాటు మెప్మా ద్వారా మరో రూ.35 వేల రుణం మంజూరు చేయిస్తామి వివరించి పనులు వేగవంతంగా జరిగే విధంగా చూడాలన్నారు. ఈ బిల్లులు విడతల వారిగా మంజూరు చేస్తామనిదీనిపై లబ్దిదారులకు అవగాహన కల్పించి పనులు వేగవంతంగా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ప్రతి వారం పనులను పరిశీలన చేయడంతో పాటు సమీక్షలు నిర్వహిస్తామన్నారు. అందరు కలిసి అనుకున్న గడువు లోగా పనులను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ డిఇఇ నీరజ, గృహ నిర్మాణ శాఖ ఎఇ ఫణిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.