Feb 28,2023 09:19

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌

          పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాకు కేటాయించిన గృహ నిర్మాణ లక్ష్యాలను అనుకున్న సమయంలోపు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు కషి చేయాలని కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి హౌసింగ్‌, నాడు-నేడు, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, సచివాలయాల్లో అందిస్తున్న సేవలు, తదితర అంశాలపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, హౌసింగ్‌, డిఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హౌసింగ్‌ పరిధిలో ఉగాది నాటికి సామూహిక గహ ప్రవేశాలు కింద జిల్లాలో 10,600 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం నిర్ధేశించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 2,336 ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి అర్బన్‌, హిందూపురం, హిందూపురం అర్బన్‌, బుక్కపట్నం తదితర ప్రాంతాల్లో పురోగతి తక్కువగా ఉందని, ఇక్కడ వెంటనే పనుల వేగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ తదితర భవన నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలని ఆదేశించారు. సచివాలయాల సేవలకు సంబంధించి జిల్లాలో 33 సచివాలయాల్లో ఆధార్‌ అప్డేట్‌ చేయడం లేదని, కొన్ని సచివాలయాల్లో ఒక్కటీ చేయడం లేదన్నారు. అన్ని సచివాలయాల్లో ఆధార్‌ అప్డేట్‌ చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను ప్రతి రోజు పూర్తి స్థాయిలో నమోదు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్‌ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ గోపాల్‌ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.