Sep 15,2023 22:36

ఎన్‌సిహెచ్‌.శ్రీనివాస్‌, జగ్గయ్యపేట మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి

ప్రజాశక్తి - జగ్గయ్యపేట: గ్రీన్‌ టెక్‌ ఫ్యాక్టరీలో తక్షణమే ఉత్పత్తిని నిలుపుదల చేసి డిసెంబర్‌లోగా ఫ్యాక్టరీని తొలగించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో మరోమారు పోరాటానికి సిద్ధమని సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌సిహెచ్‌.శ్రీనివాస్‌, జగ్గయ్యపేట మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి హెచ్చరించారు. పట్టణంలోని డివిఆర్‌ నగర్‌లో గల సుందరయ్య భవన్‌లో శుక్రవారం సిపిఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్‌.సిహెచ్‌.శ్రీనివాస్‌, నాగమణి మాట్లాడుతూ మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట గ్రామ సమీపంలోని రామచంద్రుని పేట రోడ్‌లో గల గ్రీన్‌ టెక్‌ ఫ్యాక్టరీని తరలించాలని కోరుతూ రెండున్నర సంవత్సరాలుగా చేసిన పోరాట ఫలితంగా ఫ్యాక్టరీని డిసెంబర్‌ నాటికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తుంది. అది ఆచరణలో నిజం చేస్తూ ఉత్పత్తిని వెంటనే నిలుపుదల చేసి డిసెంబర్‌ నాటికి పూర్తిగా తీసివేయాలన్నారు. ఈ ఫ్యాక్టరీ వలన జనావాసాలతో పాటు పశు సంపద ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల గతంలో ఫ్యాక్టరీ సమీపంలోని పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విదితమేనని, జీవాలు సైతం ఈ ఫ్యాక్టరీ సమీపంలో నీటిని తాగి అస్వస్థతకు గురయ్యాయని ఈ ఫ్యాక్టరీ వల్ల రామచంద్రునిపేట, అనుమంచిపల్లి, షేర్‌ మహమ్మద్‌ పేట గ్రామ ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని కాబట్టి తక్షణమే ఫ్యాక్టరీలోని ఉత్పత్తిని నిలుపుదల చేసి డిసెంబర్‌ నాటికి ఈ ఫ్యాక్టరీని తరలించాలని లేకపోతే మరో మారు ప్రజల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోటా కష్ణ, షేక్‌ గౌస్‌ మియా, కాకనబోయిన లింగారావు, జె వెంకటరావు, కోట రవికుమార్‌, దంతాల రాజేశ్వరి, దంతాల నరేంద్ర, కోటేశ్వరి, ఎస్‌ రామనాథం, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.