- కలెక్టర్‌కు సిఐటియు నేతల వినతి
ప్రజాశక్తి-విజయవాడ: గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధించి గతంలో మాదిరిగానే పారదర్శకంగా పరీక్షా ఫలితాలు ప్రకటించాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడుతూ ఐసిడిఎస్ గ్రేడ్ 2 సూపర్‌వైజర్ పోస్టులకు ఈ నెల 18న పరీక్షలు నిర్వహించారన్నారు. పరీక్ష పూర్తి అయిన వెంటనే కీ ఇస్తారని ఆశించినా ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు. ఫలితాలు కూడా ప్రకటించలేదన్నారు. ఈ నెల 25న కొద్దిమందిని మాత్రమే ఇంగ్లీషులో మాట్లాడుతూ వీడియోలు తీసి పంపమని హఠాత్తుగా సిడిపిఒలు తెలియజేశారన్నారు. దీనిపై అంగన్‌వాడీల్లో పలు అనుమానాలు, అపోహలు కలుగుతున్నాయన్నారు. వేలాది మంది పరీక్షలు రాసినప్పటికీ, ఫలితాలు ప్రకటించకుండా కొద్ది మందికే మాత్రమే వీడియోలు తీయటం సమంజసం కాదన్నారు. ఇప్పటికయినా ఫలితాలను పారదర్శకంగా వెల్లడించి అంగన్‌వాడీల అనుమానాలను నివృత్తి చేయాల్సిన కర్తవ్యం జిల్లా ఉన్నతాధికారులపై ఉందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పరీక్షా ఫలితాల ప్రకటన ప్రక్రియ అంతా ప్రాసెస్ ప్రకారం జరిగిందని, అయినా సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి, నివృత్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ప్‌ర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ సుప్రజ, జిల్లా ఉపాద్యక్షులు టి గజలక్ష్మి, ఎన్ రమాదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










