- మిల్లర్ల గుప్పెట్లో ఆర్‌బికెలు
- ధాన్యం రైతుల నెత్తిన రవాణా భారం
- ధర, తూకంలో మోసం శ్రీ మరింత దోపిడీకి గురవుతున్న కౌలు రైతులు
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : 'రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్తే ధాన్యం పరీక్షించి గణేష్ మిల్లుకు తీసుకెళ్లమన్నారు. ఇదేటి అని అడిగితే ఇక్కడ ధాన్యం దించివాళ్లు, ఎత్తేవాళ్లు లేరు. ఇక మీ ఇష్టం. పోనీ కష్టపడి దించుకుందామంటే గోనె సంచులు ఇవ్వలేదు. ధాన్యం బాగోలేవంటూ క్వింటాకు ఐదు కేజీలు మిల్లర్‌కు అదనంగా ఇవాల్సి వుంటుందని ఆర్‌బికెలో పనిచేస్తున్నోళ్లే మెలికపెట్టారు. తీరా వారు ఇచ్చిన చీటీ పట్టుకుని మిల్లుకు తీసుకెళ్లాక ఎనిమిది కేజీలు తీసుకుంటామన్నారు. గట్టిగా అడిగే సరికి ధాన్యం వెనక్కి తీసుకెళ్లిపోమని బెదిరించారు.'
ఇదీ గజపతినగరం మండలం పాతబగ్గాం గ్రామానికి చెందిన ఐదెకరాల రైతు యవర్న పకీర్ ఆవేదన. మిల్లుకు 67 క్వింటాళ్లు తీసుకెళ్తే ఆరు క్వింటాళ్లు తరుగుకింద కొట్టేశారని, 61 క్వింటాలకు మాత్రమే లెక్కకట్టారని 'ప్రజాశక్తి' ఎదుట కంటతడి పెట్టాడు. దీనివల్ల రూ.12 వేలతోపాటు ట్రాక్టర్ అద్దె, కళాసీ ఛార్జీలు 153 బస్తాలకు రూ.10 చొప్పున 1,530 చెల్లించానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
'రైతులు తమ వద్దకు ధాన్యం తీసుకురావడం లేదు. శాంపిల్స్ మాత్రమే తెస్తున్నారు. ఆ తరువాత నేరుగా మిల్లర్ల వద్దకు ధాన్యం తీసుకెళ్లిపోతున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. డాక్యుమెంటేషన్ చేయడం మా బాధ్యత కాబట్టి ఆ పని మాత్రమే మేం చేయగలుగు తున్నాం. స్థానికంగా గోనె సంచులు లేనిమాట వాస్తవమే. ఒకవేళ రైతులు ధాన్యం తెచ్చినా వాటిని నిల్వ చేసుకునేం దుకు గోడౌన్ సదుపాయం లేదు'. ఇదీ పాతబగ్గాం ఆర్‌బికె అగ్రికల్చర్ అసిస్టెంట్ కె.ప్రవీణ్‌కుమార్ వాదన
పాతబగ్గాం ఆర్‌బికె పరిధిలోని పాతబగ్గాం, బంగారమ్మపేట, భూదేవిపేట గ్రామాల పరిధిలో 550మంది రైతులు 930ఎకరాల్లో వరి సాగు చేశారు. వీరి నుంచి 930 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వారం రోజులు కాస్తోంది. ఇప్పటి వరకు 269 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు ఆర్‌బికె రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఆచరణలో ఇక్కడ ఒక్క గింజా కొనుగోలు చేయలేదు. నేరుగా కళ్లాల నుంచే 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గణేష్, శ్రీవెంకటేశ్వర, మహాలక్ష్మి, శివశక్తి మిల్లులకు తరలించుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో, రైతులంతా గత్యంతరం లేని పరిస్థితుల్లో నేరుగా మిల్లర్లనే ఆశ్రయించాల్సివస్తోంది. కేవలం పాతబగ్గాంలోనో గజపతినగరం మండలంలోనో కాదు... జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు 'ప్రజాశక్తి' క్షేత్ర స్థాయి సర్వేలో వెల్లడైంది.
ఆర్‌బికెలు, గ్రామాలను ప్రజాశక్తి సందర్శించి ధాన్యం క్రయ, విక్రయాలపై ఆరా తీసింది. చాలాచోట్ల తూనిక యంత్రాలు ఉన్నప్పటికీ ఎక్కడా కొనుగోలు చేయడం లేదు. రైతుల పేరు, ఊరు, సాగు భూమి వివరాలు, ధాన్యంలో తేమ శాతం రికార్డులో రాసుకుని ఎప్పటి మాదిరిగానే మిల్లులకు పొమ్మంటున్నారు. తీరా అక్కడికి వెళ్లాక ధాన్యంలో పటుత్వం తక్కువగా ఉందని, దిగుబడి తక్కువ వస్తే తమకు నష్టం వస్తుందని సాకులు చెప్తూ మిల్లర్లు క్వింటాలుకు అదనంగా ఎనిమిది నుంచి పది కేజీల ధాన్యం తీసుకుంటున్నారు. గట్టిగా నిలదీస్తే ధాన్యం బాగోలేవు, తీసుకునేదే లేదంటూ బెదిరిస్తున్నారు. ఆర్‌బికెలు మిల్లర్ల కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఒక్క ఆర్‌బికెలోనూ గోనె సంచులు అందుబాటులో లేవు. మిల్లర్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఇదేమని అడిగితే కొంతమంది అధికారులకు, ప్రజాప్రతినిధులకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని మిల్లర్లు చెబుతున్నారంటూ రైతులు 'ప్రజాశక్తి' ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణపై తరచూ సమీక్షలు, విస్తృత తనిఖీలు తప్ప అధికారులు అక్కడ వాస్తవ పరిస్థితులపై స్పందించి చక్కదిద్దేందుకు ప్రయత్నించడం లేదు. సచివాలయంలో ధాన్యం తీసుకోవడం లేదని, ఇక్కడికి వచ్చిన రైతులందర్నీ నాలుగు కిలోమీటర్ల పరిధిలోని కొణిశ జంక్షన్‌లోని మిల్లుకు తీసుకెళ్లమంటు న్నారని పాతబగ్గాం గ్రామానికి చెందిన తగరంపూడి సత్యనారాయణ, లెంక రాధాకృష్ణ, భూదేవిపేటకు చెందిన రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ అద్దె కూడా మేమే చెల్లించుకోవాల్సివస్తుందని తెలిపారు.
క్వింటాలుకు అదనంగా 8 కేజీలు తీసుకున్నారు
-శనపతి బంగార్రాజు, రైతు, పురిటిపెంట, గజపతినగరం మండలం
పేరుకు రైతు భరోసా కేంద్రాలు. ధాన్యం క్రయ, విక్రయాలు అంతా మిల్లర్లకు అనుగుణంగా సాగుతోంది. ఆర్‌బికెల్లో కనీసం సంచులు కూడా ఇవ్వలేదు. మిల్లరు వద్ద సంచులు తెచ్చుకుని, వారికే 25 క్వింటాళ్ల ధాన్యం విక్రయించాం. నాణ్యత తక్కువగా ఉందంటూ ప్రతి క్వింటాలుకూ అదనంగా ఎనిమిది కేజీలు తీసుకున్నారు. అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోవడం లేదు.
అధికారులు, ప్రజాప్రతినిధుల అండతోనే దోపిడీ
దాసరి సింహాద్రి, రైతు సంఘం జిల్లా నాయకులు
అధికారులు, ప్రజా ప్రతినిధుల అండతోనే ధాన్యం రైతులను దోపిడీ చేస్తున్నారు. మిల్లర్లకు పరోక్షంగా సహకరించడం తో ఆర్‌బికెలు అచేతనంగా మారాయి. రాజకీయ ఒత్తిడితో ఆర్‌బికెలు మిల్లర్లు చెప్పినట్టు నడుచుకుంటునాయి. దీన్ని ఆర్‌బికె సిబ్బంది మొదలుకుని, అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు దోచుకుంటున్న ధాన్యంలో వాటాలు అందుతున్నాయన్న అనుమానం కలుగుతోంది.










