పోలవరం ప్రాజెక్టును 2023 ఖరీఫ్ నాటికి సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారంనాడు శాసనసభలో చేసిన ప్రకటన నిర్మాణం మరింత ఆలస్యమవుతోందని విదితం చేసింది. గడువులు అలా అలా పెరుగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టు కోసం సర్వస్వం కోల్పోయి నిరాధారులుగా మిగిలిన నిర్వాసితులకు తగిన పరిహారం చెల్లించడంలో గాని వారికి సక్రమమైన పునరావాస పునర్నిర్మాణ చర్యలు చేపట్టే విషయంలోనూ స్పష్టత కొరవడడం బాధాకరం. 1.06 లక్షల కుటుంబాలకు పునరావాసం కల్పించవలసివుండగా ఇప్పటికి 7,962 కుటుంబాలను తరలించామని ముఖ్యమంత్రి సభకు తెలియజేశారు. క్షేత్ర స్థాయిలో చూస్తే ఐదు వేల కుటుంబాలను కూడా తరలించలేదని నిర్వాసితుల నేతలు చెబుతున్నారు. సిఎం చెప్పింది లెక్కలోకి తీసుకున్నా పట్టుమని పది శాతం కుటుంబాలకు కూడా పునరావాసం కల్పించలేదని తేలిపోయింది. అదే ప్రధాన డ్యాం నిర్మాణ పని 76.29 శాతం, కాలువల పనులు ప్రాజెక్టు నిర్మాణం 92.57, 71.11 శాతం పూర్తయినట్టు ఇరిగేషన్ శాఖ సమీక్షా నివేదికలు పేర్కొంటున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టంతా నిర్మాణ పనులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపైనే ఉందనీ, నిర్వాసితులను గాలికొదిలేస్తున్నారనీ స్పష్టమవుతోంది. ప్రాజెక్టు పనులు పూర్తి చేసి మమ్మల్ని గోదాట్లో ముంచేస్తారా... అని నిర్వాసితులు బెంగటిల్లుతున్నారు. ప్రభుత్వాల రాజకీయ ప్రాధాన్యతలు ఎలావున్నా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవధారగా ప్రజలు భావిస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులో నిర్మాణం, పునరావాసం వేర్వేరు అంశాలు కావు. నిజానికి పునరావాసం ముందుగా పూర్తి చేయడం పాలకుల బాధ్యత.
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా విభజన హామీలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసగిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 నాటి అంచనాల ప్రకారం మాత్రమే నిధులు కేటాయిస్తామని కేంద్రం పేర్కొనడం దారుణం. రాష్ట్ర పునర్నిర్మాణ (విభజన) చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నందున పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టాలని, పర్యావరణ, అటవీ అనుమతులతోపాటు పునరావాస పునర్నిర్మాణానికి సంబంధించిన అనుమతులను సంపాదించడం దాని బాధ్యతేనని విభజన చట్టం స్పష్టంగా పేర్కొంది. అంత స్పష్టంగా నిర్దేశించినా కేంద్ర ప్రభుత్వం ఏవో సాకులు చెప్పి తన బాధ్యత నుండి తప్పించుకోజూస్తోంది. గత తెలుగుదేశం, నేటి వైసిపి ప్రభుత్వాలు కేంద్రాన్ని నిలేసి, నిధులు రాబట్టుకోవడం కాకుండా వినతులు, అనధికార రాయబారాలతో సరిపెట్టడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఇప్పటికైనా తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని, పునరావాస పునర్నిర్మాణ ఖర్చునూ కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ఇతర సంస్థలూ ప్రజల సహకారంతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ చట్టం (2013) ప్రకారం పారదర్శకంగా పరిహారాలు చెల్లించడం, పునరావాస పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయడం అవశ్యం. నిర్వాసితులకు వునరావాసం, పరిహారం పూర్తిగా అమలు చేసిన తర్వాతే గ్రామాలు ఖాళీ చేయించాలని, కాంటూరు లెక్కల ఆధారంగా కాకుండా 1986 నాటి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాల సర్వే చేయాలని, పునరావాసం దశల వారీగా కాకుండా ఏక కాలంలో అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని, ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రతి ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కాదు. నిర్వాసితుల్లో అత్యధిక శాతం గిరిజనులు. షెడ్యూల్డు ప్రాంతంలో జీవనం సాగించడానికి అలవాటు పడిన ప్రజలు. వారిని ఆ పరిసరాలనుండి బలవంతంగా దూరం చేసి పునరావాస బాధ్యతను విస్మరిస్తే అది ఆ గిరిజనులకు ప్రాణాంతకమే అవుతుంది. ఈ ప్రాథమిక అవగాహన కేంద్ర బిజెపికి ఎటూ లేదు. కాని, వారికి అండగా ఉంటామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం కూడా మాట తప్పితే అది ద్రోహమే !










