Jul 20,2021 21:31

* పోలవరం పునరావాసంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో :
పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గిరిజనులను బలవంతంగా ఖాళీ చేయించడంపై జాతీయ ఎస్‌టి కమిషన్‌ స్పందించింది. దీనికి సంబంధించి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్‌దాస్‌, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌, కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో ఉన్న కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో గిరిజనులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు జాతీయ ఎస్‌టి కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కనీస సదుపాయాలు లేకుండా, గృహలు నిర్మించి ఇవ్వకుండా, 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా గిరిజనులను బలవంతంగా తరిమేయడం సరికాదని పిటీషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎస్టీ కమిషన్‌ స్పందిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338 (ఎ) ప్రకారం ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూనవరం, విఆర్‌ పురం మండలాల్లోని గిరిజనులను బలవంతంగా ఖాళీ చేయించడంపై కమిషన్‌ నివేదిక కోరింది. పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా తరలించడంపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదులో వచ్చిన ఆరోపణలపై వాస్తవాలు, సమాచారం, ఆరోపణలపై తీసుకున్న చర్యలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను 15 రోజుల్లో ఇవ్వాలని అధికారులను జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆదేశించింది. ఒక వేళ నిర్ణీత సమయంలో నివేదిక అందించకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338 (ఎ)లో క్లాజ్‌ (8) ప్రకారం కమిషన్‌ ముందు హాజరు కావడానికి సమాన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.

ఫిర్యాదులో ఏముంది?
ఆర్‌అండ్‌ఆర్‌ సర్వే 2022 నాటికి పూర్తవుతుందని, ఆర్‌ఆండ్‌ఆర్‌ కమిషన్‌ లిఖితపూర్వకంగా ఈఏడాది మే 4వ తేదీన తెలిపిందని పిటీషన్లో పొందుపరిచారు. అయినా, తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లో నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇతర జిల్లాలకు వెంటనే పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారని తెలిపారు. ఇప్పటికే దేవీపట్నం మండలంలో పలు గ్రామాల్లో గిరిజనులను బలవంతంగా తరలించారని తెలిపారు. వరరామచంద్రాపురం, కూనవరం మండలాల్లో 19 గ్రామాల్లో గిరిజనులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివాసీలను అడవికి దూరం చేసే కుట్ర ఇందులో ఉందని, గోదావరిలోయలో అడవిపై ఆధారపడి బతికేవారిని వేరేచోటకు తరలిస్తే జీవనం కష్టమవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాఫర్‌ డ్యాం పేరుతో కృత్రిమ వరదను సృష్టించి గ్రామాలను ఖాళీ చేయించడం హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు.

న్యాయం జరిగే వరకూ పోరాటం : వెంకటేశ్వరరావు
గిరిజనులను బెదిరించి గ్రామాల్లో నుండి తరిమేసే కుట్ర చేస్తున్నారని, వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం నిర్వహిస్తానని మాజీ ఎమ్మెల్యే, ఎస్‌టి కమిషన్లో ఫిర్యాదు చేసిన సీతంశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే దేవీపట్నం మండల పరిధిలో గ్రామాలను ఖాళీ చేయించారని, కూనవరం, విఆర్‌పురం గ్రామాల్లోకి అధికారులు వచ్చి గిరిజనులను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. కొండలపైకి వెళ్లి పాకలు వేసుకుంటే అటవీశాఖ అధికారులు వచ్చి పీకేస్తున్నారని, కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు.