Oct 22,2023 00:01

'గగన్‌యాన్‌' టివి-డి ప్రయోగం విజయవంతం

'గగన్‌యాన్‌' టివి-డి
ప్రయోగం విజయవంతంప్రజాశక్తి- సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 ప్రయోగ విజయాలతో రెట్టింపు ఉత్సాహంతో సరికొత్త ప్రయోగానికి నాంది పలికింది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఉదయం 8.45 నిమిషాలకు ప్రయోగించాలనుకున్న టీవీ డి1 రాకెట్‌ పైకి లేవకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు షార్‌ అధికారవర్గాలు తెలియజేశాయి. ఆటోమేటిక్‌ లాంచ్‌ సీక్వెన్స్‌లోని ఆన్‌ బోర్డ్‌ కంప్యూటర్‌ ప్రయోగాన్ని ఆపేసింది. కౌన్‌డౌన్‌ సమయం పూర్తయినప్పటికీ రాకెట్టు ప్రయోగాన్ని ఆపేశారు. సాంకేతిక లోపంతో అనుకున్న సమయానికి రాకెట్‌ ప్రయోగం చేయలేకపోయారు. ఆ లోపాన్ని సరిచేసి శనివారం ఉదయం 10గంటలకు ప్రయోగాన్ని విజయవంతం చేశారు. 1 గంట 15 నిమిషాలు లేటుగా ప్రయోగం చేసి విజయవంతం చేశారు. భవిష్యత్‌లో జరిగే మానవ సహిత రాకెట్‌ ప్రయోగాల కోసం జరిపే పరిశోధనల్లో భాగంగా మానవ రహిత కమాడ్యులును ప్రయోగించారు. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికపై నుండి టెస్ట్‌ వెహికల్‌ టీవీ డి1 రాకెట్‌ ద్వారా కమాడ్యూల్‌ను ప్రయోగించడం విజయవంతం చేశారు. 4520 కిలోల బరువు కలిగిన కమాడ్యూల్‌ ప్రయోగం అనంతరం 17 కిలోమీటర్లు ఎత్తు వరకు వెళ్లి అక్కడ నుండి ప్యారాచూట్ల సహాయంతో శ్రీహరికోటకు సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం సముద్రంలో పడిపోవడం జరిగింది. నేవీ వారి సహాయంతో తిరిగి మాడ్యూల్‌ను వెనక్కు తీసుకురావడం జరిగింది. అంటే భవిష్యత్‌లో ఇలాంటి మాడ్యూళ్లలో మనుషులను పెట్టి పైకి పంపడం జరుగుతుంది. అవి తిరిగి సురక్షితంగా భూమి మీదకు చేరుకునేలా పరీక్షల నిమిత్తం ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించడం జరిగింది. ఇలాంటి ప్రయోగాలు విజయవంతమైతే అంతరిక్ష పర్యటనలు సులభతరం అవుతుంది.