Sep 29,2023 17:05

ప్రజాశక్తి - తుగ్గలి : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు.. మారెళ్ళ గ్రామానికి చెందిన రైతు యాపదిన్నే హనుమంతు (60) తన సొంత పొలం నాలుగు ఎకరాలతో పాటు మరో పది ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి పంటలు చేతికందకపోవడంతో సాగు నిమిత్తం చేసిన అప్పులకు వడ్డీల భారం అధికమైంది. సుమారు రూ.ఐదు లక్షలకు పైగా అప్పులయ్యాయి. అప్పులకు తోడు కుటుంబపోషణ భారం అధికమవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య లక్ష్మి దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.