Apr 11,2023 21:04

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి కృషి : కలెక్టర్‌


ప్రజాశక్తి-రాయచోటి: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అధికారుల దృష్టికి తీసుకురావాలని డివిఎంసి కమిటీ సభ్యులను సూచించారు. అన్యాయం జరిగిన వారి పక్కన జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. 01-12-2022 తేదీ నుంచి 31-03-2023 తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి 16 కేసుల్లో 11 కేసులకు సంబంధించి రూ.4.50 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. మిగిలిన కేసులు సంబంధించి పురోగతిలో ఉన్నాయన్నారు. 2002 నుంచి 2023 వరకు 90 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సభ్యులు ఏదైనా సంఘటన జరిగితే క్షేత్రస్థాయిలో వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకోని బాధిత పక్షాన నిలబడాలన్నారు. డివిజన్‌ స్థాయిలో సమావేశం నిర్వహించినప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై డివిఎంసి కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆర్‌డిఒలను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి జిల్లా స్థాయి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగం ఇస్తామని మోసం చేసే కేసులపై సీరియస్‌గా తీసుకొని కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గత సమావేశంలో చర్చించిన అంశాలు యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టుపై కలెక్టర్‌ సుదీర్ఘంగా సమీక్షించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సమీక్షలో అడిషనల్‌ ఎస్పీ డాక్టర్‌ రాజ్‌ కమల్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఫార్మెన్‌ అహమ్మద్‌ఖాన్‌, సాంఘిక సంక్షేమ శాఖ సాధికారికత జిల్లా అధికారి జాకీర్‌ హుస్సేన్‌, జిల్లా బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సందప్ప, రాయచోటి, మదనపల్లి ఆర్డీఓలు రంగస్వామి, మురళి, డీఎస్పీలు, ఎస్సీ, ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సభ్యులు సదాశివకుమార్‌, అంజనప్ప, శివశంకర్‌, వెంకటరమణ, డి.వెంకటరమణ, ఐ.ఈశ్వరయ్య, ఎస్‌.ఫరీదా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష