- చివరి రోజు భారీ బహిరంగ సభ
ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో - రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధంచేయడమే లక్ష్కంగా ఈ నెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. దీంతో మహానాడు ప్రాధాన్యత నంతరించుకుంది. టిడిపికి చెందిన పలువురు నేతలు నెల రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి మహానాడుకు పది వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్తున్నారు. చివరిరోజు బహిరంగ సభకు మూడు లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. అధికార వైసిపి నేతలు 'గడపగడపకూ..' కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెడతున్నారు. టిడిపితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహానాడులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.
వైసిపి వైఫల్యాలను ఎండగట్టేలా ...
ఎన్నికల ఎత్తుగడలు, వ్యూహాలపై ఈ మహానాడులో చర్చలు సాగుతాయా? లేదా? చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయి నిర్ణయాలు కాకపోయినప్పటికీ సంకేతాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నరు. మూడేళ్లలో వైసిపి పాలన వైఫల్యాలపై ప్రధానంగా ఈ సమావేశం దృష్టి సారించనుంది. వైసిపి వైఫల్యాలు ఎండగట్టేలా నాయకుల ప్రసంగాలు ఉంటాయంటున్నారు. అమరావతి రాజధానితోపాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, దళితులు , మహిళలపై పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలను ప్రధానంగా ప్రస్తావిస్తారని, సాగునీటి ప్రాజెక్టులు ప్రధానంగా పోలవరం, వెలుగొండ వంటివి చర్చకు తేనున్నారు. రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలు, మార్కెట్ వైఫల్యాలు వంటివి ప్రస్తావనకు వస్తాయని చెబుతున్నారు.
జనసేనతో పొత్తుపై స్పష్టత వచ్చేనా ?
ఎన్నికల్లో రాజకీయ పొత్తులపై ఇప్పటికే చర్చ సాగుతోంది. జనసేనతో పొత్తు ఉంటుందనే చర్చ రెండు పార్టీల్లోనూ ఉంది. ఈ దిశగా చర్చలు సాగుతున్న తరుణంలో మహానాడులో దీనిపై ఓ స్పష్టతకు వచ్చే అవకాశాలున్నాయా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. టిడిపి శ్రేణుల్లో మాత్రం జనసేనతో పొత్తు ఉంటే లాభమనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
బిజెపి పట్ల ఏ వైఖరి..?
బిజెపితో ఎటువంటి వైఖరి తీసుకుంటుందన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా హిందూత్వ మతోన్మాద శక్తులు చెలరేగుతుండటంత మైనార్టీల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. లౌకికతత్వానికి కట్టుబడి ఉంటామని చెప్పుకుంటున్న టిడిపి తాజా పరిణామాల నేపథ్యంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సిఉంది. అదే విధంగా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలను మోడీ ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి తీరుతామని చెబుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో టిడిపి నాయకులు కూడా పాల్గొంటున్నారు. దీంతో బిజెపితో పొత్తు విషయమై టిడిపి శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.










