ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం : కలెక్టర్ పి.బసంత్ కుమార్
పుట్టపర్తి అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నామని రాష్ట్ర చీఫ్ ఎలాక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు కలెక్టర్ పి.బసంత్ కుమార్ వివరించారు. బుధవారం విజయవాడ నుంచి ఉపాధ్యాయులు, పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సందర్భంగా ఎంకె.మీనా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ బసంత్ కుమార్ మాట్లాడుతూ మండలి ఎన్నికలకు సంబంధించ ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ మొదలు పెట్టామన్నారు. ఈనెల 8వ తేదీ నాటికి ఓటర్స్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. పోలింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పూర్తి చేశామన్నారు. 10వ తేదీన రెండో దశ శిక్షణను ఇస్తామని తెలియజేశారు. 7వ తేదీన మైక్రోఅబ్జర్వర్లకు శిక్షణ ఇస్తామన్నారు. 86 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాంస్టింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానాన్ని ఈనెలాఖరులోపు పూర్తి చేస్తామని తెలిపారు. రాహుల్ దేవ్‌సింగ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో పకడ్బందీగా బందోబస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవోలు భాగ్యరేఖ, తిప్పేనాయక్, రాఘవేంద్ర, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఆనంద్ పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలను పాటించాలి : డిఆర్‌ఒ
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డిఆర్‌ఒ కొండయ్య ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని డిఆర్‌ఒ ఛాంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలు విజయవంతంగా జరిగేందుకు తమ సహాయ సహకారాలు అందించాలన్నారు. మండల, గ్రామ స్థాయిలో ఓటర్లను చైతన్యవంతం చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్‌పై 1,2,3 అనే అంకెలు మాత్రమే వేయాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ పేపర్‌పై 1 అనే నెంబర్ వేసినా తర్వాతనే 2,3,4 అంకెలు వేయాలని సూచించారు. అభ్యర్థి పేరుకు ఎదురుగా బాక్స్‌లో మాత్రమే నెంబర్ వేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు ఇఎస్.వెంకటేశు, సిపిఐ నాయకులు వేమయ్య, బయన్న, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.










