Nov 17,2021 07:04

బిజెపి మన రాష్ట్రానికి చేసిన ద్రోహం, రైతాంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి, ఉపాధి లేమి వంటి సమస్యలతో బాటు రాష్ట్రాల హక్కులపై సాగిస్తున్న దాడులపై కేంద్రాన్ని నిలదీయాల్సిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇంకా ఊగిసలాట ధోరణినే కొనసాగిస్తున్నది. ఆదివారం తిరుపతి వేదికగా జరిగిన ఇరవై తొమ్మిదో దక్షిణ ప్రాంత మండలి (ఎస్‌జెడ్‌సి) సమావేశంలో కేంద్రాన్ని బోనులో నిలబెట్టేందుకు అంది వచ్చిన ఒక మంచి అవకాశాన్ని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకోలేక పోయిందనే చెప్పాలి. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు అయినా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. దీనికి కేంద్రంలో బిజెపి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రస్తావించిన తీరు కేంద్రానికి ఎక్కడ నొప్పి కలుగుతుందోనన్న విధంగా ఉంది. పోలవరం ఆనకట్టను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని విభజన హామీ చట్టం స్పష్టంగా పేర్కొంటోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తికి అవసరమైన నిధులను ఇవ్వకుండా కేంద్రం లోని మోడీ సర్కార్‌ మడత పేచీలు పెడుతున్నది. నిర్వాసితుల పునరావాసం తన బాధ్యత కాదన్నట్లు మాట్లాడుతున్నది. ఈ పితలాటకాలు చెల్లవు, పోలవరం ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రం ఇవ్వాల్సిందేనని గట్టిగా డిమాండ్‌ చేయడానికి జంకాల్సిన పని లేదు. ఏదాదికొకసారి తద్దినం పెట్టినట్లు వీటి గురించి స్మరించుకోవడం వల్ల రాష్ట్రానికి ఒనగూడేదేమీ ఉండదు. జిఎస్‌టిలో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటా ఇవ్వకుండా కేంద్రం ఎగ్గొట్టింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీకి ఎగనామం పెట్టింది. కడప స్టీల్‌ ప్లాంట్‌ బాధ్యత తీసుకోవడానికి నిరాకరించింది. రైల్వే జోన్‌ ప్రకటించి, దానికి గుండెకాయ వంటి వాల్తేరు డివిజన్‌ మనకు లేకుండా చేసింది. ఈ రాష్ట్రం పట్ల బిజెపి వైఖరి ఏమిటో ఇంత స్పష్టంగా కనపడుతున్నా, ఇంకా మెతకదనం ప్రదర్శించడంలో అర్ధం లేదు.
బిజెపి రాష్ట్రానికి తలపెట్టిన మరో పెద్ద ద్రోహం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ. దీని గురించి ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారేమోనని చూసిన వారికి నిరాశే మిగిలింది. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించేది లేదని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాల్సిన సమయంలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని ఏమనుకోవాలి? మోడీ ప్రభుత్వ దన్నుతో అదానీ, అంబానీలు మన రాష్ట్రంలో రేవులు, గనులు, ఇతర సహజ వనరులను కొల్లగొడుతుంటే వాటికి చెక్‌ పెట్టాల్సిన అవసరం లేదా? రైతులు పండించిన ధాన్యాన్ని ఎంఎస్‌పి రేటు ప్రకారం కొనుగోలు చేయవలసిన కేంద్రం ఆ బాధ్యతను విస్మరిస్తుంటే దానిపై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? గుజరాత్‌లో మాదిరిగా మన రాష్ట్రంలో సహకార వ్యవస్థను నాశనం చేసేందుకు అమిత్‌షా మహాశయుడు కంకణం కట్టుకున్నట్లుగా ఇటీవల వార్తలు వస్తున్నాయి. వీటిని తిప్పికొట్టకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమయం అవుతుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బిజెపితో చేతులు కలిపి ఇటువంటి సాచివేత ధోరణినే ప్రదర్శించడం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. వైసిపి ప్రభుత్వం ఇప్పుడు అదే ధోరణి అనుసరిస్తే మనం మరింత నష్టపోతాం. కార్పొరేట్లకు దాస్యం చేస్తూ, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న బిజెపి కుట్రలను తిప్పికొట్టి మన ప్రయోజనాలను కాపాడుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. ప్రజలందరి మద్దతును కూడగట్టాలి. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకు పోవడానికి ప్రయత్నించాలి. ఈ విషయంలో వైసిపి ప్రభుత్వం తన మెతక వైఖరిని ఎంత త్వరగా విడనాడితే రాష్ట్రానికిి అంత మంచిది.