ప్రజాశక్తి రొద్దం : మండలంలోని ప్రధాన అధికారులు ఎమ్మెల్యే శంకరనారాయణకు తొత్తులుగా మారారని టిడిపి జిల్లా అధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారధి ఆరోపించారు. మండలంలోని బిదానపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల మాటలు విని అధికారులు చట్టాన్ని మరచి వ్యవహరిస్తున్నారన్నారు. మండలంలోని కంబాలపల్లి సర్పంచి మంజు తండ్రి రామాంజినేయులు ప్రభుత్వం 3సెంట్లు స్థలాన్ని ఇచ్చిందన్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన గుడిసె వేసుకొని జీవనం చేస్తున్నాడన్నారు. ఇప్పుడు అది కూలిపోవడంతో అయన మల్బరీ షెడ్డు షెడ్డు కోసం నిర్మాణం చేపడితే గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు అడ్డుకోవటానికి కుట్ర పన్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణ ప్రోద్భలంతోనే ఇది జరుగుతోందని ఆరోపించారు. అధికారులు ఎమ్మెల్యేకు తొత్తులుగా మారి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో వర్గ కక్షలు పెట్టడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామకృష్ణప్ప, పార్లమెంట్ అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, చిన్నప్పయ్య, మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










