వాషింగ్టన్ : వాణిజ్య ప్రకటనలు లేని ట్విటర్ వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు మస్క్ శనివారం వెల్లడించారు. అక్టోబర్‌లో ట్విటర్‌ను మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ట్విటర్‌లో ప్రకటనలు తరచూ కనిపిస్తాయని, చాలా పెద్దవిగా ఉంటాయని అన్నారు. రాబోయే వారాల్లో రెండింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలిపారు. కొంచెం ఎక్కువ ధరతో దీన్ని ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ కింద తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీన్ని ఎంపిక చేసుకున్నవారికి ఎలాంటి ప్రకటనలు ఉండబోవని తెలిపారు.
ఇప్పటి వరకు ట్విటర్ ఆదాయం కోసం వాణిజ్య ప్రకటనలపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. ట్విటర్‌ను సొంతం చేసుకున్న అనంతరం 7,500 మంది ఉద్యోగుల తొలగింపు, ట్విటర్ బ్లూ వంటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ పాలసీలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంస్థ శ్రామిక శక్తిలో సగానికి పైగా తొలగించడంతో ప్రకటనలు ట్విటర్‌కు ప్రశ్నార్థకంగా మారాయి. కంటెంట్‌ను నియంత్రించడానికి తగినంత సిబ్బంది లేకపోవడంతో సమస్యగా మారుతోంది. దీంతో కంపెనీలు ట్విటర్‌కు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తుండటంతో ఆదాయం గణనీయంగా పడిపోయినట్లు సమాచారం. వ్యయాలను గణనీయంగా తగ్గించడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడమే తన వ్యూహమని మస్క్ గతంలో స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే ట్విటర్ బ్లూను ప్రకటించారు. ట్విటర్ బ్లూ ప్రస్తుతం అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సబ్‌స్క్రిప్షన్ నెలకు 11 డాలర్లకు, వెబ్ సబ్‌స్క్రిప్షన్ నెలకు 8 డాలర్లు, ఏడాదికి 84 డాలర్ల రాయితీ వద్ద లభిస్తోంది.










