ఎల్లంపల్లి (పెద్దపల్లి) : ఎగువ రాష్ట్రాల్లోనూ, తెలంగాణలోనూ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 87,440 క్యూసెక్కులగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేశారు. 87,440 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టిఎంసిలు కాగా.. ప్రాజెక్టులో ప్రస్తుతం 19.73 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఇదే జిల్లాలోని మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న పార్వతీ బ్యారేజ్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. పార్వతీ బ్యారేజ్‌లో ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 32,736 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ 74 గేట్లలో 40 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. పార్వతీ బ్యారేజ్ పూర్తి స్థాయి నీటినిల్వ 8.83 టిఎంసిలు కాగా.. ప్రస్తుతం 7.10 టిఎంసిల నీరు ఉంది.










