Sep 30,2020 07:44

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను యథేచ్ఛగా అమ్మటానికి ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే ఎల్‌ఐసి లో వాటాలు అమ్మేందుకు అత్యంత వేగంగా పావులు కదుపుతున్నది. తాజాగా ఎల్‌ఐసి లో ఐపిఓ లు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది.
ఎల్‌ఐసి లో ఐపిఓ అనేది రాజకీయపరమైన విషయం. మనం రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్నందున ప్రతి ఒక్క ఆర్థిక నిర్ణయాన్ని రాజకీయ ప్రయోజనాల దష్ట్యానే తీసుకోవడం జరుగుతుంది. ఎల్‌ఐసి భారీ ఆస్తులపై కన్ను పడిన ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు గాను...ఎల్‌ఐసి ని ఈ తోడేళ్ళ గుంపు లోకి తోసేసే కుట్ర జరుగుతోంది. ఎల్‌ఐసీ లో ఐపీఓ అనేది 10 శాతం మాత్రమే అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో 25 శాతం వాటాలను ఉపసంహరించుకోవాలని ప్రైవేట్‌ మదుపర్ల ఒత్తిడితో ఎల్‌ఐసి బోర్డులో తీర్మానం ప్రవేశ పెడతారు. తర్వాత మరిన్ని వాటాలను విక్రయించాలంటారు. అలా అంతిమంగా ఎల్‌ఐసి ప్రైవేటు పరం అవుతుంది. ఐపిఓ కు వ్యతిరేకంగా ఇప్పుడు పోరాడకపోతే, పది సంవత్సరాలు గడిచేసరికి... భారతదేశం గర్వించదగ్గ ఎల్‌ఐసి, ప్రైవేటు వారి చేతుల్లోకి పోవడాన్ని చూడవలసి రావచ్చు.
ప్రైవేట్‌ వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థల విలువను తగ్గించి వెల కట్టిన సందర్భాలను మనం చూశాం. పెట్టుబడిదారులు తమకు కావలసిన దాన్ని పొందడం కోసం అన్ని రకాల అనైతిక పద్ధతులకు పాల్పడతారు. ఈ క్రమంలో తగ్గించి వెలకట్టబడ్డ ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కొంటారు. ఎల్‌ఐసి ఆస్తులు మదింపులో కూడా ఇదే జరగబోతోంది. ఎల్‌ఐసి అత్యధిక పెట్టుబడులు కలిగిన సంపన్న సంస్థ. అందువలన దాని వ్యాపారానికి గానీ విస్తరణకు గానీ ఇతరుల పెట్టుబడుల అవసరం లేదు. లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ప్రీమియంల రూపంలో సమీకరించి ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వానికి అందిస్తోంది. మార్కెట్‌ లోకి వెళ్లి నిధులు సేకరించాల్సిన అవసరం లేనప్పుడు లిస్టింగ్‌ చేసి, ఎల్‌ఐసి వాటాలను ఉపసంహరించాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నది ప్రశ్న. బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం...అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేయాలన్న కంకణం కట్టుకుంది. ఒకపక్క 'ఆత్మ నిర్భర భారత్‌' అని చెబుతూ రెండో పక్క దేశానికి స్వావలంబన కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతోంది. ఒకనాడు బ్రిటిష్‌ మందుల కంపెనీలతో పోటీ పడి విజయం సాధించిన ప్రభుత్వ రంగ 'బెంగాల్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌' ను అమ్మివేయాలని నిర్ణయించడం దేశ స్వావలంబనకు చేటు తెస్తుంది. అంతేగాక, ఎల్‌ఐసి లో వాటాల ఉపసంహరణ తర్వాత, ఎల్‌ఐసి బోర్డు లోకి చొరబడిన ప్రైవేట్‌ వారు తాము పెట్టిన పెట్టుబడులపై తగినంత రిటర్న్స్‌ కావాలని ఒత్తిడి చేస్తారు. ఇది ఎల్‌ఐసి సామాజిక బాధ్యతలను పల్చన చేసి...దేశ పురోభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది.
ఐపిఓ లతో ప్రయోజనం ఎవరికి?
135 కోట్ల మంది దేశ ప్రజలకా? లేక మూడు శాతం మంది గా ఉండే మదుపరులకా? అన్నది ప్రశ్న. ఎల్‌ఐసి లో ఐపిఓ వలన సామాన్య మదుపరులు ప్రయోజనం పొందుతారన్న ప్రభుత్వ వాదన హాస్యాస్పదమైనది. దేశంలోని 135 కోట్ల మంది ప్రజానీకం పురోగతి కోసం ఎల్‌ఐసి నిధులను ఉపయోగించడం జరుగుతోంది. కానీ ఐపివో వలన దేశ ప్రజానీకంలో మూడు శాతం మందికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.
ఎల్‌ఐసి లో వాటాల ఉపసంహరణ దరిమిలా, లాభాలే ఏకైక లక్ష్యంగా ఉండే మదుపరుల ప్రయోజనాలకు అనుగుణంగా ఎల్‌ఐసి విధానాలు రూపొందించబడతాయి. దీనివల్ల దేశ పురోభివృద్ధికి, పట్టాదారుల ప్రయోజనాలకు తీవ్ర హాని కలుగుతుంది. ఇప్పటికే ఎల్‌ఐసి అనేది అత్యంత సమర్థవంతమైన పారదర్శకమైన సంస్థ. అటువంటి సంస్థ వాటాల ఉపసంహరణ వలన దాని సామర్థ్యం పెరుగుతుందని ఊహించడం అశాస్త్రీయం. షేర్‌ మార్కెట్లో అమ్మకాలకు పెట్టిన డిహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐఎల్‌ఎఫ్‌ అండ్‌ ఎండిటి, ఆర్‌ కామ్‌, రిలయన్స్‌ డిఫెన్స్‌, ఎస్సార్‌ లకు ఏ గతి పడుతున్నదీ మనం చూస్తున్నాం.
ఎల్‌ఐసి ని మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన సంస్థగా ప్రభుత్వం తయారు చేయాలని అనుకున్నట్లయితే ఎల్‌ఐసి కి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి దాని వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. సంస్థాపరమైన విలువలు, సంస్కృతికి ఎల్‌ఐసి కట్టుబడి ఉండటం ద్వారా సాధారణ ప్రజల సద్భావన సంపాదించింది. తద్వారా ఎల్‌ఐసి అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా తయారయ్యింది. గత ఆరు దశాబ్దాలుగా, ఒక తరం నుండి ఇంకొక తరానికి ఎల్‌ఐసి విలువలు, నిజాయితీ, సంస్కృతి అందించింది. అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా, ఎల్‌ఐసి ప్రజల ఆదరణ చూరగొనడానికి ఇదే కారణం.
ఎల్‌ఐసి కి సంబంధించిన నిరర్ధక ఆస్తుల అంశాన్ని గోరంతలు కొండంతలు చేసి...ఎల్‌ఐసి ప్రతిష్టను మసకబార్చే కుట్ర ఒకటి పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో నడుస్తోంది. వాస్తవానికి ఎల్‌ఐసి నిరర్ధక ఆస్తులు 0.46 శాతం కన్నా తక్కువ. అందువల్ల ఈ దుష్ప్రచారాన్ని వాస్తవాలు, గణాంకాలతో తిప్పికొట్టాలి. షేర్‌ మార్కెట్లో లిస్టింగ్‌, వాటాల ఉపసంహరణకు వెనుక వున్న కారణాలను అర్థం చేసుకుంటే తప్ప మనం దీనిని తిప్పి కొట్టలేం. ఎల్‌ఐసి ఉద్యోగులతో సహా మధ్య తరగతిలో నయా ఉదారవాదం పట్ల సుముఖత ఒక బలమైన అంత: ప్రవాహంగా ఉంది.
ప్రజా ధనాన్ని కొల్లగొట్టేందుకే
నయా ఉదారవాద విధానాలను ఇష్టపడే వారమైతే ఎల్‌ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడలేం. నయా ఉదారవాదాన్ని అసహ్యించుకోనివారు ఎల్‌ఐసీ లో ఐపిఓను ప్రతిఘటించలేరు. నయా ఉదారవాద విధానాలంటే లాభార్జనే ధ్యేయంగా ఉండే అంబానీ, అదానీ వంటి వారికి అనుకూలంగా రూపొందించబడే విధానాలు. మన బుర్రలో ఉన్న నయా ఉదారవాద అనుకూల భావాల్ని తొలగించుకుని, ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను ప్రతిఘటిస్తామని దృఢ సంకల్పం చేపట్టాలి. అప్పుడే ఎల్‌ఐసీ లో ఐపిఓ కి వ్యతిరేకంగా జరిగే క్యాంపెయిన్‌ శక్తివంతమౌతుంది.
ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారు. కాబట్టి ఐపిఓ కు వ్యతిరేకంగా జరిగే క్యాంపెయిన్‌ ను ఆదరించేవాళ్ళ సంఖ్య మరింత పెరుగుతుంది. అందుకోసం ప్రతిఘటనా రూపాలనన్నింటిని ఉపయోగించాలి. ఐపీఓ కు వ్యతిరేకంగా మనం చేసే వాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి యూట్యూబ్‌ ఛానళ్లను ప్రారంభించాలి. సామాజిక మాధ్యమాలను ఉపయోగించాలి. ప్రభుత్వం చేస్తున్న ఈ మొత్తం కసరత్తు అంతా ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి ఉద్దేశించబడిందని ప్రజలకు వివరించాలి. తద్వారా వారిని చైతన్యవంతుల్ని చేసి ఒప్పించవచ్చు.
ఎల్‌ఐసీ కి సంస్థాగతమైన నీతి నియమాలు, బలంగా పాదుకొల్పిన నైతిక విలువలూ ఉన్నాయి. అవినీతి రహితమైన, అత్యంత సమర్థవంతమైన పని విధానం కలిగిన సంస్థ అని ఎల్‌ఐసికి పేరుంది. అందువల్ల ఎల్‌ఐసి లో ఐపిఓ కి వ్యతిరేకంగా మనం చేసే క్యాంపెయిన్‌కు అత్యధిక ప్రజానీకం మద్దతునందిస్తారు. అందుకే, పోరాటం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉందాం. ఒక క్రమబద్ధమైన, బలమైన ప్రతిఘటనను నిర్మిద్దాం. ఎల్‌ఐసి ని కాపాడుకుందాం.
(ఆదివారం నాడు 'వన్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌' నిర్వహించిన వెబినార్‌ లో డా|| రతన్‌ ఖస్నబీస్‌ చేసిన ఉపన్యాస సారాంశమిది. ఆయన కోల్‌కతా ఆదమాస్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌ డీన్‌ గా పనిచేస్తున్నారు.)