Feb 27,2023 22:03

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ :కర్నాటక ప్రభుత్వం తుంగభద్ర నది మీద ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్‌ డాక్టర్‌ తులసి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం పట్టణం లోని కోటా లాడ్జిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర రాయలసీమకు జీవనాడి అని అన్నారు. నదిలో 416 టీఎంసీల నీరు ఏడాదికి నికర జలాలు ఉన్నాయని ఈ మేరకు బచావత్‌ ట్రబునల్‌ అవార్డు ప్రకటించిందని అన్నారు. ఇందులో 290 టీఎంసీలు కర్నాటకకు, 126 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించిందన్నారు. అయితే కర్నాటకకు కేటాయించిన నీటిని ఆరాష్ట్రం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటుందన్నారు. ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం ఎగువ భద్ర ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ప్రభుత్వం బడ్జెట్‌ లో రూ. 5300 కోట్లు కేటాయించిందన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మోడీ ప్రభుత్వం రాయలసీమకు ద్రోహం చేయాలని చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నోరు ఎత్తకపోవడం శోచనీయమని అన్నారు. ఈ సమావేశంలో ఎఐసిసి సభ్యులు కోటా సత్యం, కడప నాయకులు రామకృష్ణ, ఉత్తన్న, ఆమీర్‌, వెంకటేష్‌, వేమయ్య తదితరులు పాల్గొన్నారు.