May 31,2022 08:28
  • పలు జిల్లాల్లో అరెస్టులు, గృహనిర్బంధాలు

ప్రజాశక్తి- యంత్రాంగం : ధరల పెరుగుదల, భారాలపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. వామపక్షాల ఆధ్వర్యాన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ సోమవారం జరిగిన ధర్నాలు, నిరసనల్లో ప్రజలు భాగస్వాములయ్యారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం అరెస్టులు, గృహనిర్బంధాలకు పాల్పడింది. నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయినా, మండుటెండను సైతం లెక్క చేయకుండా వామపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలెక్టరేట్లు, జిల్లా కేంద్రాలు, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోలు, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతుండడాన్ని, కేంద్ర ప్రభుత్వం షరతులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను, విద్యుత్తు ఛార్జీలు పెంచడాన్ని, చెత్త పన్ను విధించడాన్ని వక్తలు తీవ్రంగా నిరసించారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు వెళ్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతోపాటు పలువురి నాయకులను పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత విడుదల చేశారు. అనంతరం అనంతపురంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ధరలను తగ్గించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వామపక్ష పార్టీల నాయకులపై ప్రభుత్వం పోలీసుల చేత నిర్బంధం విధించడం దుర్మార్గమన్నారు. ప్రజలపై మోపిన భారాలను తగ్గించాల్సిందే పోయి, వాటిని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేయడం శోచనీయమన్నారు. వామపక్ష, ప్రజా పోరాటాల వల్లనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు ధరలు తగ్గించాల్సి ఉందన్నారు.
    అక్రమ అరెస్టులు, ముందస్తు అరెస్టులు, కేసులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. అనంతపురం త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద సిపిఎం నాయకులను, సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిపిఎం, సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరం, కదిరి, హిందూపురం ప్రాంతాల్లోనూ పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిలో పలువురు సిపిఎం, సిపిఐ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కర్నూలు జిల్లాలో పోలీసులు అరెస్టులు, గహనిర్బంధాలకు పాల్పడ్డారు. అనకాపల్లి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి మాట్లాడుతూ దేశాన్ని, దేశ సంపదను కొల్లగొడుతున్న బిజెపి పాలకులను గద్దె దించేవరకు పోరాడాలన్నారు. ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఇచ్చిన అదానీ, అంబానీలకు లాభాలు సమకూర్చే పనిలో మోడీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మోడీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలు అడ్డూఅదుపులేకుండా పెరుగుతున్నాయన్నారు. విశాఖ కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు ఎ.స్టాలిన్‌, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.లక్ష్మి ప్రసంగించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం సంపన్నులకు, కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారాలు మోపుతుండడం దుర్మార్గమన్నారు. ఎంసిపిఐ, ఎస్‌యుసిఐ నాయకులు ప్రసంగించారు. విజయవాడ బందర్‌ రోడ్డులోని ఎన్‌టిఆర్‌ విజయవాడ జిల్లా కలెక్టరేట్‌ వద్ద పది వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. 2014లో మోడీ అధికారంలోకి రాకముందుఅప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వంట గ్యాస్‌పై రూ.50 పెంచితే ఢిల్లీ వీధుల్లో బిజెపి నేతలు స్మృతిఇరాని, సుష్మా స్వరాజ్‌, అమిత్‌ షా తదితరులు ఆందోళనలు చేశారన్నారు. నేడు బిజెపి ప్రభుత్వం గ్యాస్‌ ధరను రూ.470 నుండి రూ.1,030కి పెంచడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మిగతా 2లో సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ బిజెపి ఎనిమిదేళ్ల పాలనలో ఏ తప్పూ చేయలేదని ప్రధాని మోడీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ఎనిమిదేళ్లలో ప్రజలపై రూ.25 లక్షల కోట్ల పన్నుల భారం మోపారని తెలిపారు. కె.పోలారి (సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ), డి.హరనాథ్‌ (సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌), ఖాదర్‌ బాషా (ఎంసిపిఐయు), ఎం రామకృష్ణ (పిడిఎస్‌యు), సుధీర్‌ (ఎస్‌యుసిఐసి) తదితరులు మాట్లాడుతూ ధరలు తగ్గించే వరకూ, భారాలు ఉపసంహరించే వరకూ ప్రజాందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. నంద్యాలలో కలెక్టరేట్‌ ముందు ధర్నా అనంతరం వామపక్ష నాయకులు స్పందనలో ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ బయటకు రావాలంటూ నినాదాలు చేస్తూ ఆడిటోరియంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్‌ గేట్లు ఎక్కి వామపక్ష నాయకులు నినాదాలు చేశారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లు ధర్నాలు, నినాదాలతో హోరెత్తాయి. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.