Jan 18,2022 08:33
  • అమ్మిన ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుకు ఆటంకం
  • ఖాతాలో నగదు జమ అవుతుందో, లేదోనని ఆందోళన

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన ఓ రైతు అదే గ్రామానికి చెందిన మిల్లులో నేరుగా ధాన్యం విక్రయించాడు. ఈ వివరాలను నమోదు చేయించేందుకు రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె)కు వెళ్లాడు. ఆ రైతు వరి సాగు వివరాలు ఇ-క్రాప్‌లో నమోదు చేయించినా అవి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. ఈ గ్రామంలో మొత్తం 1,996.66 ఎకరాలకు సంబంధించి 826 మంది రైతుల పేర్లు ఇ-క్రాప్‌లో అధికారులు నమోదు చేశారు. అయితే, వారిలో 213 మందికి చెందిన 521 ఎకరాల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. మరో ఆరు ఎకరాలు ఇ-క్రాప్‌లో నమోదు కాలేదు. ఈ సమస్య ఆ గ్రామానికే పరిమితం కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి సమస్య ఉంది.
    ధాన్యం రైతులను ఇ-క్రాప్‌ నమోదు కష్టాలు వెంటాడుతున్నాయి. రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన వరి విస్తీర్ణం, భూమి సర్వే నంబర్‌, బ్యాంకు ఖాతా తదితర వివరాలను గత అక్టోబర్‌ చివరి వరకూ ఇ-క్రాప్‌లో అధికారులు నమోదు చేశారు. అయితే, వీరిలో కొందరి పేర్లు ప్రస్తుతం ఈ సైట్లో కనిపించడం లేదు. దీంతో, రైతులు తన ధాన్యాన్ని అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇ-క్రాప్‌ సైట్‌ను నిలిపివేయడంతో ఇటువంటి వారి పేర్లు మళ్లీ నమోదుకు అవకాశం లేకుండా ఉంది.
    పంట వేసిన సమయంలోనే ఇ-క్రాప్‌ నమోదును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇ-క్రాప్‌ సైట్లో కనిపించని రైతుల నుంచి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె)లో ధాన్యం కొనుగోలు చేయడం లేదు. కొందరు రైతులు నేరుగా మిల్లర్లకు ధాన్యం విక్రయించి ఆ తర్వాత వీటి వివరాల నమోదు కోసం ఆర్‌బికెకు వస్తున్నారు. వీరిలో కొందరి పేర్లు ఈ-క్రాప్‌ సెట్లో కనిపించడం లేదు. దీంతో, ధాన్యం డబ్బులు తమ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయో, లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 6,54,390 ఎకరాల్లో వరి సాగు చేసిన 2,56,836 మంది రైతుల పేర్లు ఇ-క్రాప్‌లో నమోదయ్యాయి. వీటిలో సుమారు 40 వేల మందికి చెందిన లక్షన్నర ఎకరాల వివరాలు ఆన్‌లైన్‌లో ప్రస్తుతం కనిపించడం లేదు.
 

                                                 పరిష్కారమైతేనే రైతు ఖాతాలో నగదు

పెట్రోలు, డీజిల్‌, ఎరువులు ధరలు పెరిగిపోవడంతో ఒక ఎకరం వరి సాగుకు రూ.35 వేలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. 75 కిలోల ధాన్యాన్ని బస్తాగా లెక్కిస్తున్నారు. జిల్లాలో సగటున 27 నుంచి 30 బస్తాల మధ్య దిగుబడి వచ్చింది. 17 నుంచి 23 బస్తాలు కౌలు చెల్లిస్తే రెక్కల కష్టం కూడా మిగలడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే ధాన్యం అమ్మి అప్పులు చెల్లించి వడ్డీలు తగ్గించుకుందామని నూర్పిళ్లు వేగవంతం చేశారు. సాంకేతిక కారణాలతో కొందరి రైతుల పేర్లు ఇ-క్రాప్‌లో కనిపించడం లేదు. సమస్య పరిష్కారానికి ఆర్‌బికెల చుట్టూ చుట్టూ వారు ప్రదక్షిణలు చేస్తున్నారు.
 

                                                      ఉన్నతాధికారులకు లేఖ రాశాం

ఇ-క్రాప్‌లో నమోదైనా కొన్ని పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీనిపై పలువురు రైతులు వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే కాకుండా జిల్లాలోని 13 మండలాల్లో 5,600 మంది రైతుల పేర్లు ఇప్పటి వరకు నమోదు కాలేదని గుర్తించాం. ఈ సమస్య పరిష్కారానికి ఇ-క్రాప్‌ నమోదుకు తిరిగి అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులకు లేఖ రాశాం. త్వరలోనే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం.
                -టి.మోహనరావు, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు, కృష్ణా జిల్లా