ప్రజాశక్తి - ఎ.కొండూరు : వ్యవసాయ మార్కెటింగ్ యార్డు ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కష్ణ అన్నారు. ఎ.కొండూరు మండలం పాత కొండూరు అట్ల ప్రగడ గ్రామాలకు చెందిన రైతుల నుండి 2021లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంత వరకు డబ్బులు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు బుధవారం ఎ.కొండూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి.కృష్ణ మాట్లాడుతూ 14 మంది రైతులకు సంబంధించి 11 లక్షల 30 వేలు ధాన్యం బకాయిలను ప్రభుత్వం చెల్లించవలసి ఉందన్నారు. రైతులు తమకు రావలసిన డబ్బులు కోసం విజయవాడ మంగళగిరి ఏ కొండూరు తహశీల్దార్ కార్యాలయం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయని రైతుల గోడును అధికారులు గానీ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పుకునే ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని ఆయన అన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధికి రైతులు పడుతున్న ఈ బాధలు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ నుండి రైతులకు రావలసిన రైతులకు రావలసిన డబ్బులు విషయంలో తిరువూరు ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వారం రోజుల్లో అధికారులు ఈ సమస్యను పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటా వార్పు కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు రైతు సంఘం నాయకులు అమ్మిరెడ్డి ఎస్ రామకష్ణారెడ్డి అమ్మిరెడ్డి పి ఆనందరావు చిన్న దుర్గారావు లక్ష్మారెడ్డి యోహాను రాములు రైతులు ఈ శ్రీనివాసరావు వేంపాటి సునందన్‌రావు నాగేష్ బరోతు కేవళ బిచ్చ బి.నాగేంద్ర వెంకటేశ్వరరావు బి.రాందాసు అనిమీయ తదితరులు పాల్గొన్నారు.










