ప్రజాశక్తి-మార్టూరు రూరల్: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అణగ దొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని, ఈ దుర్మార్గపు పాలన అంతమొందించేందుకు దళితులంతా ఏకం కావాలని ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు, టిడిపి బాపట్ల పార్లమెంటు అధ్య క్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండపి శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. శనివారం ఇసుక దర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో బాపట్ల పార్లమెంట్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళిత ప్రతిఘటన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టిడిపి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వైసిపి పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. దళితులపై రోజుకో చోట దాడులు జరుగుతున్నా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివద్ధీ జరగలేదని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి.. ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వంపై దళితులంతా ఏకమై ఎదురుతిరిగి పోరాడాలన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన దళితుల పెళ్లికానుకను సైతం గాలికి వదిలేశారని మండిపడ్డారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతూ.. ఎమ్మెల్యేకు సమస్య వివరించటానికి వస్తే.. ఆ రైతు పట్ల దురుసుగా వ్యవహరించటం దారుణమన్నారు. అధికార మదంతో విర్రవీగితే త్వరలో ప్రజాగ్రహం తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల, యర్రగొండపాలెం, ఎస్.ఎన్.పాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు నరేంద్రవర్మ, ఎరిక్షన్‌బాబు, బిఎన్.విజయకుమార్ మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదగడానికి కషి చేస్తానని నమ్మబలికిన సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల్లో ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఎత్తివేసి దళితులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి అదే దళితులను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. టిడిపితోనే దళితుల ఆత్మగౌరవం సాధ్యమన్నారు. ప్రతి దళితవాడలో సిమెంట్‌రోడ్డు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పునరుద్ఘాటించారు. అనంతరం టిడిపి రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్‌బాబు, దామచర్ల సత్య, దేవతోట నాగరాజులు మాట్లాడారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, రేపల్లె సీనియర్ నాయకులు జీవి నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ నాయకులు దయబాబు, బాపట్ల పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి సరోజిని, బేతపూడి సురేష్, దేవతోటి సుందర్రావు, కూచిపూడి మోహన్‌రావు, ఏసోబు, గంజి శ్రీను, శ్యామ్, నాగరాజు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల టిడిపి నాయకులు, దళితులు పాల్గొన్నారు.










