దళితుల భూములు లాక్కుంటే సహించం సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు
దళితుల భూములు లాక్కుంటే సహించం
సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు
ప్రజాశక్తి - ఓజిలి: దళితులకు భూమిపై హక్కు కల్పించాలని దళితులకు ఇచ్చిన భూములను లాక్కొని పరిశ్రమలకు కట్టబెట్టాలనే దురుద్దేశంతో అధికారులు దళితులను మోసగిస్తున్నారని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పేర్కొన్నారు. ఓజిలి మండలంలోని మాచవరంలో సిపిఎం బందం ఆదివారం పర్యటించింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ మాచవరంలో దళితులకు కేటాయించిన సర్వే నెంబర్ 207లో సాగుపట్టాలు, డికేటి పట్టాలు ఇచ్చారని ఆ భూములు దళితులు, పేదలు సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారని తెలిపారు. ఉన్న ఫళంగా ఇప్పుడు పశువుల మేత సాకుతో వీరి భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు చూస్తున్నారని దీనికి సిపిఎం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇదే ప్రాంతంలో క్వారీకి అనుమతులు ఇచ్చి తవ్వకాలు చేస్తున్నవారికి వర్తించని పశువుల మేత పోరంబోకు భూములు దళితులకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు భూములు కల్పిస్తామని ఒకపక్క ప్రచారం చేస్తూ మరొకపక్క పేదలకు ఇచ్చిన భూములు లాక్కొని పరిశ్రమాధిపతులకు కట్టబెట్టాలని చూస్తున్నారని దీనిపై సిపిఎం నిరుపేదల పక్షాన నిలబడి భూ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయుడుపేట మండల కార్యదర్శి శివకవి ముకుంద, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చెంగయ్య, ఐద్వా నాయకులు చంద్రకళ, మురళి, గురవయ్య, కష్ణయ్య పాల్గొన్నారు.










